ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు

12 Nov, 2020 10:50 IST|Sakshi

మార్కెట్ల దూకుడు- విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పుష్‌

జాబితాలో రైల్‌టెల్ కార్పొరేషన్‌, బర్గర్‌ కింగ్‌, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌

బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా ఆర్‌ఈఐటీ, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ

ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ. 20,000 కోట్లు

ముంబై: ఇటీవల భారీ లాభాలతో్ దూసుకెళుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. తద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో మెరుగైన లిస్టింగ్‌ను సాధించాలని చూస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. ఐపీవోలు చేపట్టేందుకు ఇటీవల పలు కంపెనీలు సెబీవద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. జాబితాలో రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, బర్గర్‌ కింగ్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా ఆర్‌ఈఐటీ, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్ కంపెనీ, కళ్యాణ్‌ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పలు కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించడంతో రానున్న ఆరు వారాల్లోగా ఐపీవో మార్కెట్‌ జోరందుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బుధవారమే(11న) చైనీస్‌ మాతృ సంస్థ ఫోజన్‌ ఫార్మాకు చెందిన గ్లాండ్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూ ముగిసిన విషయం విదితమే.

భారీ ర్యాలీ
ఈ నెలలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఏకంగా 10 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు కేవలం 8 ట్రేడింగ్ సెషన్లు మాత్రమే తీసుకోవడం విశేషం. ఇటీవల మార్కెట్లు జోరు చూపడంతో మార్చి కనిష్టాల నుంచి 70 శాతం పురోగమించింది. అమెరికాలో జో బైడెన్‌ విజయం సాధించడం, ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ కోవిడ్‌-19 కట్టడిలో సఫలమైనట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్ల కారణంగా లిక్విడిటీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుండటం ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలోనే రూ. 20,000 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం గమనార్హం! మరోవైపు ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి సెప్టెంబర్‌లోనే 8 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టాయి!

మరిన్ని వార్తలు