-

ఐపీవో స్ట్రీట్‌: మజగాన్‌ డాక్, యూటీఐ ఏఎంసీ

26 Sep, 2020 14:49 IST|Sakshi

మంగళవారం- గురువారం మధ్య పబ్లిక్‌ ఇష్యూలు

రక్షణ రంగ పీఎస్‌యూ- మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌

ధరల శ్రేణి రూ. 135-145- రూ. 444 కోట్ల సమీకరణ లక్ష్యం

రెండో పెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ- యూటీఐ ఏఎంసీ

ధరల శ్రేణి రూ. 552-554- రూ. 2,160 కోట్ల సమీకరణ టార్గెట్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్‌ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 135-145. ఐపీవోలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15.17 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.06 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వం రూ. 444 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు 3.45 లక్షల షేర్లను కేటాయించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. 

కంపెనీ వివరాలు
రక్షణ రంగ పీఎస్‌యూ మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌.. 40,000 డీడబ్ల్యూటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా ఓడలు, సబ్‌మెరైన్లను రూపొందిస్తోంది. రక్షణ శాఖకు అవసరమయ్యే యుద్ధనౌకల తయారీ, మరమ్మతులను చేపడుతోంది. వాణిజ్య ప్రాతిపదికన ఇతర క్లయింట్లకు వెస్సల్స్‌ను తయారు చేస్తోంది. 2006లో కంపెనీ మినీరత్న హోదాను పొందింది. కంపెనీ రుణరహితంకావడంతోపాటు.. ముంబై తీరంలో ఉండటంతో అధిక అవకాశాలు పొందుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్డర్లను త్వరగా పూర్తిచేయగలగడం, తద్వారా వేగంగా క్యాష్‌ఫ్లోను సాధించగలగడం వంటి అంశాలు కంపెనీ భవిష్యత్‌పై ప్రభావం చూపే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రక్షణ రంగ బడ్జెట్‌ ఆలస్యంకావడం లేదా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడటం ద్వారా వ్యయాలు పెరగడం వంటి ప్రతికూలతలు ఎదురుకావచ్చని తెలియజేశారు. 

యూటీఐ ఏఎంసీ
నిర్వహణలోని ఆస్తుల రీత్యా దేశంలోనే రెండో పెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. యూటీఐ ఏఎంసీ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్‌ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 552-554. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బీవోబీ, పీఎన్‌బీ, టీ రోవ్‌ ప్రైస్‌ ఇంటర్నేషనల్‌ వాటాలు విక్రయించనున్నాయి. మొత్తం 3.9 కోట్ల షేర్లవరకూ ఆఫర్‌ చేస్తున్నాయి. ఇది కంపెనీ ఈక్విటీలో 30.75 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా  రూ. 2,160 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. అర్హతగల ఉద్యోగులకు 2 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. 

కంపెనీ వివరాలు
యూటీఐ ఏఎంసీలో ప్రస్తుతం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, పీఎన్‌బీ, బీవోబీ 18.24 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. టీ రోవ్‌ ప్రైస్‌కు 26 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్‌బీఐ, బీవోబీ, ఎల్‌ఐసీ 8.25 శాతం, టీ రోవ్‌, పీఎన్‌బీ 3 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. 2019లో ఈపీఎఫ్‌వో నిధులలో 55 శాతం నిర్వహణకు యూటీఐ ఏఎంసీ అనుమతిని పొందింది.  గత కొన్నేళ్లుగా యూటీఐ ఏఎంసీ ఉత్తమ రిటర్నులు, మార్జిన్లను సాధిస్తున్నట్లు శామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్‌ నిపుణులు నిరాలీ షా పేర్కొన్నారు. మార్కెట్‌ క్యాప్‌ టు ఈక్విటీ QAAUM ప్రకారం చూస్తే 18 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. ప్రస్తుత ఐపీవో ధర కంటే చౌకగా ఈ ఏడాది కంపెనీ ఉద్యోగులకు షేరుకి రూ. 728 ధరలో వాటాలను కేటాయించినట్లు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు