యూనివర్సల్‌ బ్యాంకుగా మారే యోచనలో పోస్టల్‌ బ్యాంకు

15 Mar, 2023 09:04 IST|Sakshi

న్యూఢిల్లీ: విస్తృతమైన పోస్టాఫీసుల నెట్‌వర్క్‌ ఉన్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) .. పూర్తి స్థాయి బ్యాంకుగా మారే యోచనలో ఉంది. తద్వారా మరింత మందికి ఆర్థిక సేవలు అందించవచ్చని భావిస్తోంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐపీపీబీ ఎండీ, సీఈవో జె. వెంకట్రాము ఈ విషయాలు తెలిపారు. 

2018లో ఐపీపీబీ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు 80 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవని, ప్రస్తుతం టెక్నాలజీ వినియోగంతో ఇది 20 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో మారు మూల ప్రాంతాలకు కూడా చేరడం సాధ్యపడుతుందని, పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ లభిస్తే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పడగలదని వెంకట్రాము చెప్పారు. 

ప్రస్తుతం పేమెంట్‌ బ్యాంకు హోదాలో ఐపీపీబీ.. డిపాజిట్లు, రెమిటెన్సులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సర్వీసులు అందించగలదు. కానీ రుణాలు ఇవ్వడానికి, క్రెడిట్‌ కార్డులు జారీ చేయడానికి వీలు లేదు. మరోవైపు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం సరైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు