రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. మరో ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌!

2 Mar, 2023 16:54 IST|Sakshi

తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్‌సీటీసీ) ప్రత్యేకంగా మరో ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొస్తోంది. ఐఆర్‌సీటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కలిసి కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్‌పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్ కనెక్ట్ యాప్‌లలో ఈ కార్డును ఉపయోగించి బుక్ చేసే రైలు టిక్కెట్‌లపై ప్రత్యేకమైన ప్రయోజనాలతోపాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. 

ఈ కో-బ్రాండెడ్ కార్డ్ మెరుగైన ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యుత్తమ ప్రయోజనాలతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక లాంజ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుందని ఐఆర్‌సీటీసీ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ సహిజ పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం పొందిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు తమదేనని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావ్ తెలిపారు. గతంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంకులతో కూడా ఐఆర్‌సీటీసీ ఇలాంటి భాగస్వామ్యాలు చేసుకుంది.

ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ ప్రయోజనాలు:

  • ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్‌పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ టికెటింగ్ వెబ్‌సైట్, రైల్ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లపై గరిష్ట తగ్గింపు.
  • ఆకర్షణీయమైన జాయినింగ్‌ బోనస్, బుకింగ్‌లపై తగ్గింపులు. 
  • దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌లలోని  ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లకు యాక్సెస్.

(ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్‌ ఈవీ పేరు ‘కామెట్‌’... రేసింగ్‌ విమానం స్ఫూర్తితో...) 

>
మరిన్ని వార్తలు