ఐఆర్‌సీటీసీకి రూ.25 కోట్ల నష్టాలు

12 Sep, 2020 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఐఆర్‌సీటీసీ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్‌ క్వార్టర్‌లో రూ.25 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్‌లో రూ.72 కోట్ల నికర లాభం వచ్చిందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. కరోనా వైరస్‌ కల్లోలం, లాక్‌డౌన్‌ల   కారణంగా ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది.  కార్యకలాపాల ఆదాయం రూ.459 కోట్ల నుంచి 71 శాతం పతనమై రూ.131 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. టూరిజం విభాగం ఆదాయం రూ.48 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిందని తెలిపింది. కేటరింగ్‌  విభాగం ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.90 కోట్లకు, రైల్‌నీర్‌ ఆదాయం రూ.58 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గాయని పేర్కొంది.

మర్చంట్‌ బ్యాంకర్ల డెడ్‌లైన్‌ 14 వరకూ పొడిగింపు  
ఐఆర్‌సీటీసీలో 15–2 శాతం వాటాను కేంద్రం ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)మార్గంలో విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయానికి   మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీని ఈ నెల 10 నుంచి మరో నాలుగు రోజులు... .ఈ నెల 14 వరకూ పొడిగించింది. ఐఆర్‌సీటీసీలో కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది.

సెబీ పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఐఆర్‌సీటీసీ వాటా విక్రయం ఒకింత తోడ్పడుతుందని అంచనా.  కేంద్రం ఇటీవలనే హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది.   మర్చంట్‌ బ్యాంకర్ల గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ షేర్‌ 0.2% లాభంతో రూ. 1,374 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు