రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు... ఇవి షేర్లా అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమా?

19 Oct, 2021 13:59 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. కొత్త ఇన్వెస్టర్లు వరదలా దలాల్‌ స్ట్రీట్‌కి పోటెత్తుతున్నారు. దేశీ సూచీలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఇలా ఎంత పాజిటివ్‌గా చెప్పినా సరే ఈ కంపెనీ షేర్లు ధరలు అంతకు మించిన అన్నట్టుగా ఉన్నాయి. కేవలం రెండంటే రెండేళ్లలోనే ఎవ్వరూ నమ్మలేని రీతిలో ఇన్వెస్టర్లకు లాభాలు అందించింది. 

ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) షేర్లు  దుమ్ము రేపుతున్నాయి. గిల్లుకుని చూస్తే తప్ప నమ్మలేని రేంజ్‌లో ఈ కంపెనీ షేర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసాధారణ రీతిలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుండటంతో అత్యంత తక్కువ కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ కంపెనీ షేర్‌ ధర పెరిగింది.

రెండేళ్ల కిందట
ఐఆర్‌సీటీసీ సంస్థ స్టాక్‌ మార్కెట్‌లో తొలిసారిగా 2019 సెప్టెంబరులో అడుగు పెట్టింది. ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కి (ఐపీవో)కి వచ్చినప్పుడు షేర్‌  ప్రైస్‌బ్యాండ్‌ ధర రూ. 315 నుంచి 320 మధ్య పలికింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ రూ. 640 కోట్లుగా నమోదు అయ్యింది.

లక్ష కోట్లు దాటింది
ఈ ఏడాది ఆరంభంన ఉంచి ఐఆర్‌సీటీసీ షేర్లు మార్కెట్‌లో హాట్‌కేకుల్లా మారాయి. మరీ ముఖ్యంగా గత రెండు నెలలుగా ఇన్వెస్టర్లు వీటిని ఎగబడి కొంటున్నారు. దీంతో షేర్‌ విలువ అమాంతం పెరిగిపోతుంది. అక్టోబరు 19న ఐఆర్‌సీటీస షేర్‌ వ్యాల్యూ రికార్డు స్థాయిలో రూ.6287లకు చేరుకుంది. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. మంగళవారం ఐఆర్‌సీటీసీ మార్కెట్‌ క్యాపిటల్‌ వన్‌ ట్రిలియన్‌ మార్క్‌ని రీచ్‌ అయ్యింది.

20 రెట్ల లాభం
రెండేళ​ కిందట రూ 31,500 పెట్టుబడి ఐఆర్‌సీటీసీ కంపెనీ షేర్లు వంద కొనుగోలు చేసి వాటిని అలాగే హోల్డ్‌ చేసిన వారికి లాభల పంట పండింది. ఈ రోజు ఈ షేర్ల విలువ రూ 6,28,700 చేరుకుంది. అంటే కేవలం రెండేళ్లలో ఇరవై రెట్ల లాభాన్ని అందించింది. ఇక ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇంత కంటే ఎక్కువే లాభాలను ఆర్జించిన వాళ్లూ ఉన్నారు. 

ఇరవై ఏళ్లలోనే
భారత ప్రభుత్వం రైల్వేకు అనుబంధంగా 1999లో ఐఆర్‌సీటీసీని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్టు బుక్‌ చేయడం, క్యాటరింగ్‌ సర్వీసులు అందివ్వడం ఈ సంస్థ విధులు. ఇరవై ఏళ్ల తర్వాత మార్కెట్‌లో లిస్టయ్యింది. రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటల్‌ను క్రాస్‌ చేసింది. 

ప్రభంజనం
కరోనా సంక్షోభం తర్వాత ఇండియన్‌ రైల్వేస్‌లో సంస్కరణలు చేపట్టడం, ప్యాసింజర్‌ రైళ్లకు కోత పెట్టడం, రాయితీలయు మంగళం పాడటం వంటి చర్యలను కేంద్రం తీసుకుంది. దీనికి తోడు ప్రైవేటు రైళ్లను కూడా పట్టాలపైకి ఎక్కించింది. దీంతో రైల్వేకు అనుబంధంగా ఉన్న ఐఆర్‌సీటీసీకి కేంద్రం తీసుకున్న చర్యలు మేలు చేశాయి. ఇక ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ పెరగడం, హస్పిటాలిటీ రంగంలోకి సైతం ఐఆర్‌సీటీసీ విస్తరించడం వంటి చర్యలు మార్కెట్‌లోకి సానుకూల సంకేతాలు పంపాయి. వెరసి ఐఆర్‌సీటీసీ స్టాక్‌మార్కెట్‌లో ప్రభంజనం మొదలైంది.

9వ కంపెనీ
స్టాక్‌మార్కెట్‌లో లాభాలు పంట పండించడంలో ప్రైవేటు కంపెనీలు ముందుంటాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ కంపెనీలది వెనుకడుగే. ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ దాటిన కంపెనీలుగా ఎనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోలిండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, భారత్‌ పెట్రోలియం, ఎస్‌బీఐ కార్డ్స్‌ ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన తొమ్మిదవ కంపెనీగా ఐఆర్‌సీటీసీ చేరింది.
 

చదవండి: లాభాలని మొత్తుకుంటే సరిపోయిందా? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు