బీమాలో భారీ సంస్కరణలు

26 Nov, 2022 09:44 IST|Sakshi

కొత్త సంస్థల ప్రవేశ నిబంధనలు సరళతరం 

సాల్వెన్సీ రేషియో తగ్గింపు

బీమా సంస్థలకు రూ.3,500 కోట్లు  

న్యూఢిల్లీ: బీమా రంగంలో కీలకమైన సంస్కరణకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ  (ఐఆర్‌డీఏఐ) ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా కొత్త సంస్థల ప్రవేశ నిబంధనలను సడలించింది. సాల్వెన్సీ రేషియోను సైతం తగ్గించింది. దీంతో ప్రస్తు్తత బీమా సంస్థలకు అదనంగా రూ.3,500 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి.  బీమా సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ శుక్రవారం నాటి బోర్డ్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది.

బీమా కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలను (పీఈ) అనుమతించింది. సబ్సి డరీలు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా మారేందుకు ఓకే చెప్పింది. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు ఐఆర్‌డీఏఐ ప్రకటించింది.  

కీలక నిర్ణయాలు.. 
► బీమా రంగంలో సులభతరమైన  వ్యాపార విధానాలకు వీలుగా, కొత్త సంస్థల రాకను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌ నిబంధనలను సవరించనున్నట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది.  
► కార్పొరేట్‌ ఏజెంట్లు ఇక మీదట గరిష్టంగా 9 బీమా సంస్థలతో టైఅప్‌ పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రస్తుతం 3గానే ఉంది. ఇన్సూరెన్స్‌ను మార్కెటింగ్‌ చేసే ఒక్కో సంస్థ గరిష్టంగా ఆరు బీమా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 2గా ఉంది.  
► సాధారణ బీమా సంస్థలు తమ నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ సాల్వెన్సీ రేషియోను 0.70 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించింది. దీనివల్ల కంపెనీలకు రూ.1,460 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి.  

► ఇక జీవిత బీమా కంపెనీలకు సంబంధించి యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల (యులిప్‌లు) సాల్వెన్సీ రేషియోను 0.80% నుంచి 0.60% చేసింది. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన సాల్వెన్సీ రేషియోను 0.10% నుంచి 0.05% చేసింది. దీనివల్ల జీవిత బీమా కంపెనీలకు రూ.2,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి.  
►  బీమా కంపెనీ చెల్లించిన మూలధనంలో ఒక ఇన్వెస్టర్‌ 25%, ఇన్వెస్టర్లు ఉమ్మడిగా 50% వాటా కలిగి ఉంటే ‘ఇన్వెస్టర్లు’గా పరిగణించనుంది. అంతకుమించితే ప్రమోటర్లుగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఒక ఇన్వెస్టర్‌కు 10%, ఇన్వెస్టర్ల సమూహానికి 25% పరిమితి ఉంది.  
►  ప్రమోటర్లు 26 శాతం వరకు వాటాను తగ్గించుకునేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది.

చదవండి: మాదాపూర్‌ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్‌ అక్కడ మొదలైంది!

>
మరిన్ని వార్తలు