3 కోవిడ్‌ టీకాలు తీసుకున్నవారికి బంపరాఫర్‌!

28 Dec, 2022 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. మూడు డోసులు టీకా తీసుకున్న వారికి  సాధారణ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్‌ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది.

కరోనా క్లెయిమ్‌లను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్‌నెట్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని, ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది. కోవిడ్‌ నిబంధనలను పాలసీదారులు అనుసరించేలా సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని బీమా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

విదేశీ ప్రయాణ బీమా పాలసీలు తీసుకునే వారికి, పలు దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణ అవసరాల గురించి తెలియజేయాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. కరోనాతో చికిత్స కోసం వచ్చే పాలసీదారుల నుంచి నెట్‌వర్క్‌ హాస్పిటళ్లు డిపాజిట్‌ తీసుకోకుండా చూడాలని కోరింది. నగదు రహిత సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో చేరినప్పటికీ, కరోనా మొదటి, రెండో విడతలో చాలా ఆస్పత్రులు రోగుల నుంచి డిపాజిట్లు తీసుకున్నాయి. దీంతో ఐఆర్‌డీఏఐ ఈ సూచన చేసింది. కరోనా కేసులు ఒకవేళ అధికంగా వస్తే సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి బీమా సంస్థలు కరోనాకు సంబంధించి 2.25 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించడం గమనార్హం.   

మరిన్ని వార్తలు