18 నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో

14 Jan, 2021 06:24 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 25–26

20న ముగియనున్న ఇష్యూ

రూ. 4,600 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభంకానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్‌) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఈ నెల 20న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 25–26గా  తెలియజేశారు. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 15న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ విలువ రూ. 10 కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 575 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  

178 కోట్ల షేర్లు
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 178.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రభుత్వం 59.4 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. మరో 118.8 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,544 కోట్లు లభించనున్నాయి. వెరసి తొలిసారి రైల్వే రంగ ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. 1986లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ ప్రధానంగా దేశ, విదేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి చౌకగా నిధులను సమీకరిస్తుంటుంది. తద్వారా దేశీ రైల్వే విభాగానికి ఆస్తుల కొనుగోలు, ఫైనాన్సింగ్‌ తదితర సేవలను అందిస్తుంటుంది. అంతేకాకుండా దేశీ రైల్వేల అధిక బడ్జెటరీ వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుతుంది.  
2017 ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్‌ రైల్వే కంపెనీలను స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫలితంగా ఇర్కాన్‌
(ఐఆర్‌సీవోఎన్‌) ఇంటర్నేషనల్, రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌), రైల్‌ వికాస్‌ నిగమ్, రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)   ఇప్పటికే ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ అయ్యాయి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు