ఉద్యోగులకు డిమాండ్‌..భారీగా పెరగనున్న నియామకాలు!

14 Jul, 2022 08:02 IST|Sakshi

ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్‌) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) వార్షిక నివేదిక వెల్లడించింది. 

ఎఫ్‌ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్‌కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్‌కు డిమాండ్‌ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్‌ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 

2022– 23లో ఫిన్‌టెక్, ఐటీ–ఇన్‌ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్‌ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్‌ స్టాఫింగ్‌ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్‌గా పరిగణిస్తారు.   

యువతే ఎక్కువ 
ఫ్లెక్సీస్టాఫ్‌కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్‌ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్‌ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ లోహిత్‌ భాటియా తెలిపారు. 

ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్‌ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్‌కు డిమాండ్‌ 10 శాతం పెరుగుతుందని ఐఎస్‌ఎఫ్‌ ఈడీ సుచిత దత్తా తెలిపారు.    

మరిన్ని వార్తలు