De-printer: ఇదో కొత్త రకం ప్రింటర్‌.. ప్రింట్‌ చేసిన కాగితాన్ని 10 సార్లు వాడొచ్చు!

22 Jan, 2023 10:24 IST|Sakshi

అచ్చేసిన కాగితాన్ని ఎన్నిసార్లు వాడొచ్చు? ఒకసారి అచ్చేసిన కాగితాన్ని ఏ పొట్లాలు కట్టుకోవడానికో తప్ప ఇంకెన్నిసార్లు వాడగలరేంటి అనుకుంటున్నారా? ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఇప్పటికీ సమాధానం తట్టడం లేదా? సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. అచ్చేసిన కాగితాన్ని అక్షరాలా పదిసార్లు వాడుకోవచ్చు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపడుతున్నారా? ఇంతవరకు అసాధ్యంగా ఉన్నదాన్నే ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారు. అదెలాగో తెలుసుకుందాం...

కంప్యూటర్లు వచ్చాక, ఆఫీసుల్లో ప్రింటర్ల వాడకం పెరిగింది. ఒకసారి ప్రింట్‌ చేసిన కాగితాన్ని మళ్లీ వాడుకునే అవకాశం ఉండకపోవడంతో కాగితాల వినియోగానికి కోతపెట్టే అవకాశం అసాధ్యమయ్యేది. అప్పటికీ కాగితం వినియోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు, కాగితానికి రెండువైపులా ముద్రించే ప్రింటర్లనూ తయారు చేశారు. ఇప్పుడు చాలా చోట్ల కాగితానికి రెండువైపులా ప్రింట్‌ చేసే ప్రింటర్లు వాడుకలోకి వచ్చాయి. వీటివల్ల కాగితాల వాడకం సగానికి సగం తగ్గింది.

కాగితాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రింట్‌ చేసిన కాగితాలను పునర్వినియోగం చేసుకునేలా ఇజ్రాయెల్‌లోని ‘రీప్‌’ కంపెనీకి చెందిన  శాస్త్రవేత్తలు ఒక అద్భుత సాధనాన్ని తయారు చేశారు. ఇది ప్రింటర్‌లాగానే కనిపిస్తుంది గాని, ప్రింటర్‌ కాదు. ఇది డీప్రింటర్‌. ప్రింట్‌ చేసిన కాగితం మీద ఉన్న ఇంకును పూర్తిగా పీల్చేసుకుని, క్షణాల్లోనే కాగితాన్ని మళ్లీ తెల్లగా మార్చేస్తుంది. ఈ డీప్రింటర్‌ ద్వారా ఇలా ఒక్కో కాగితాన్ని పదిసార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. 

అయితే, డీప్రింటర్‌ ద్వారా ఒకటికి పదిసార్లు కాగితాలను వాడుకోవాలంటే, సాధారణ కాగితాల వల్ల సాధ్యం కాదు. ఇంకును పీల్చుకోని విధంగా ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్‌లో వాడాక, ప్రింట్‌ అయిన కాగితాలను డీప్రింటర్‌లో వాడుకోవాల్సి ఉంటుంది. పదిసార్లు పునర్వినియోగానికి అవకాశం ఉండటం వల్ల ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్లలో విరివిగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయని, డీప్రింటర్‌ ద్వారా కాగితాల పునర్వినియోగం కూడా బాగా పెరుగుతుందని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

కాగితాలను రీసైక్లింగ్‌ చేయడం కొత్త కాకున్నా, ప్రింటర్‌లో ఒకసారి అక్షరాలను ముద్రించేసిన కాగితాలను ఒకటికి పదిసార్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. రీసైక్లింగ్‌ చేసిన కాగితాలను టిష్యూలు, టాయిలెట్‌ పేపర్లు, న్యాప్‌కిన్లు వంటివాటి తయారీకి ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అలాగే, వార్తపత్రికల కోసం కూడా రీసైకిల్డ్‌ పేపర్లను ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు. డీప్రింటర్‌ వాడకం పెరిగితే, కాగితాల వాడకానికి ఇక కళ్లేలు పడగలవనే ఆశించవచ్చు.

∙జగదీశ్వర్‌ కుమార్‌

మరిన్ని వార్తలు