ఆ సైంటిస్ట్‌ను ‘కొత్త’గా చంపారు! వేల కి.మీ. దూరం.. నిమిషంలో 15 బుల్లెట్లు

19 Sep, 2021 11:07 IST|Sakshi

AI In Mohsen Assassination:  అర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్సీ.. దాదాపు ప్రతీ రంగం ఇప్పుడు ఈ సాంకేతికత చుట్టూరానే రౌండేస్తోంది. ఈ తరుణంలోనే ఈ టెక్నాలజీకి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడుతుండగా.. కాసుల్ని కురిపించే వ్యాపారం నడుస్తోంది.  అయితే ఈ టెక్నాలజీ వినాశనం దిశగా అడుగులు వేయడం  కలవరపాటుకు గురి చేస్తోంది.  ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉండి..  ఓ సైంటిస్ట్‌ మేధావిని హత్యగావించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రముఖ చర్చకు దారితీసింది.
   

జేమ్స్‌ బాండ్‌ డై అనదర్‌ డే సినిమాలో ఒక సీన్‌ ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉండి.. శత్రువుని శాటిలైట్‌ సిస్టమ్‌ వ్యవస్థ ద్వారా మట్టుపెడతారు. హాలీవుడ్‌లోనే కాదు.. మన సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు చూపిస్తుంటారు. ఆ టైంకి అవి అతిశయోక్తిగా అనిపించినప్పటికీ..  వాస్తవ ప్రపంచంలోనూ సినిమాను తలదన్నే అలాంటి ఘటనే ఇరాన్‌ సైంటిస్ట్‌  మోహెసన్‌ హత్య.  ది టైమ్స్‌, న్యూయార్స్‌ టైమ్స్‌ తాజా కథనాలతో ఇప్పుడు ఈ అంశం తెర మీదకు వచ్చింది.
 

ఇరాన్‌ న్యూక్లియర్‌ సైంటిస్ట్‌.. మోహ్‌సెన్‌ ఫక్రిజదెహ్‌ మమబది. కిందటి ఏడాది నవంబర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న టైంలో ఆటానమస్‌ శాటిలైట్‌ ఆపరేటెడ్‌ గన్‌ సాయంతో ఆయన్ని హత్య చేశారు. ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్‌సెన్‌.  పూర్తిగా అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం. 

ఏం జరిగిందంటే..
ఫాదర్‌ ఆఫ్‌ ఇరాన్‌ న్యూక్లియర్‌ సైన్స్‌గా మెహ్‌సెన్‌కు పేరుంది. నిజానికి 2009లోనే ఆయనపై తొలిసారి హత్యాప్రయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు.  2019లో మరో దఫా హెచ్చరికలు జారీ అయినప్పటికీ.. ఆయన తేలికగా తీసుకున్నారు.  నవంబర్‌ 27, 2020న కాస్పియన్‌ సముద్ర తీరంలోని ఇంటి నుంచి తూర్పు టెహ్రాన్‌లోని అబ్జార్డ్‌ ఇంటికి ఎస్కార్ట్‌ మధ్య బయలుదేరాడు మోహ్‌సెన్‌ ఫక్రిజదెహ్‌.  కాసేపట్లో ఇంటికి చేరుతారనే సమయానికి ఓ సిగ్నల్‌ దగ్గర ఆయనపైకి తుటాలు సంధించారెవరో.  సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే.. చుట్టుపక్కల  ఎవరూ కనిపించకపోయేసరికి గందరగోళానికి గురయ్యాడు.  ప్రమాదంలో మెహ్‌సెన్‌ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. అలా మెహ్‌సెన్‌ను మాత్రమే మట్టుపెట్టాలనే లక్ష్యాన్ని ప్రత్యర్థులు పూర్తి చేశారు.
 

భారీ గన్‌.. సింగిల్‌ క్లిక్‌
ఇదేం ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. డ్రోన్‌ దాడులు అందరికీ తెలిసినవే. స్థావరాలు, మనుషులు..  టార్గెట్‌లు ఏవైనాసరే ఫిక్స్‌ చేసి దాడులు చేయడం డ్రోన్‌ దాడుల ప్రత్యేకత.  ఇవి గురి తప్పే సందర్భాలు చాలా తక్కువ. అలాగే డ్రోన్‌ తరహా దాడులు జరిగినప్పుడు అలారాలు మోగడం సహజం.  కానీ, ఏఐ టెక్నాలజీ అలా కాదు. అవి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితంగా, గుట్టుచప్పుడు కాకుండా చేరుకుంటాయి. అందుకే మోహ్‌సెన్‌ హత్యకుట్రలో ఈ సాంకేతికతను ఉపయోగించారు.  టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్‌ఎన్‌ ఏంఏజీ మెషిన్‌ గన్‌ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది.  ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ ద్వారా శాటిలైట్‌ లింక్‌ సాయంతో మోహ్‌సెన్‌ మీద కాల్పులు జరిపారు.  కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్‌ గన్‌.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి  టార్గెట్‌ను పూర్తి చేసింది.

వాళ్ల పనేనా?
అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్‌ రెవల్యూషన్‌ గార్డ్‌ వ్యవస్థ ఫెయిల్యూర్‌ కాదు. అమెరికా-ఇజ్రాయెల్‌ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి. రోబోటిక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి.. టార్గెట్‌ను నాశనం చేయడమే ఈ కొత్త విధానం. 2020 సమ్మర్‌ నుంచి ఇజ్రాయెల్‌ నిఘా వ్యవస్థ మోస్సాద్‌ టీం, మెహ్‌సెన్‌ హత్యకుట్రకు ప్రణాళిక అమలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. దాడికి సంబంధించి ఇరాన్‌ దగ్గర తగిన ఆధారాలు లేవు. ఒకవేళ తుపాకీ దానికదే నాశనం అయ్యే టెక్నాలజీ యాక్సెస్‌ ఉంటే మాత్రం.. ఈ కుట్రకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టడంలో ఇరాన్‌కు దారులు మూసుకుపోయినట్లే అవుతుంది. 

కంప్యూటరైజ్డ్‌ మెషిన్‌ గన్‌.. ఆన్‌ సైట్‌ ఆపరేటివ్స్‌కు దూరంగా.. ఎక్కడో కమాండ్‌ సెంటర్‌లో ఉంటూ.. నిమిషంలోనే దాడి పూర్తి చేయడం సినిమాల్లోనే కాదు.. రియల్‌ ​లైఫ్‌లో అది అర్టిఫియల్‌ టెక్నాలజీతో సాధ్యమని ఇప్పుడు మీరూ ఒప్పుకుంటారు కదా!. 

చదవండి: పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చే ఏఐ టెక్నాలజీ.. మీరూ వాడొచ్చు

మరిన్ని వార్తలు