ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?..నిండా మునిగిన దిగ్గజ బ్యాంక్‌..ఉద్యోగుల్లో కొత్త భయం!

12 Mar, 2023 08:56 IST|Sakshi

ఉక్రెయిన్ యుద్ధం, ధ‌ర‌ల మంట‌, ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీల్లో సంక్షోభం నెలకొంది. ఆ సంక్షోభం సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (svb) మూసివేతతో మరింత తీవ్రతరమైనట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికాలో ఎస్‌వీబీని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ప్రకటించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌కు చెందిన టెక్‌ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన బెంజిమన్‌.. టెక్నాలజీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘మేం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మూసి వేత..టెక్నాలజీ వరల్డ్‌ను మరింత సంక్షోభంలోకి నెట‍్టేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.   

అవసరం అయితే తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్‌ కంపెనీలకు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ కేంద్రంగా ప్రధాన టెక్‌ కంపెనీలపై ఎస్‌వీబీ ప్రభావం పడితే.. ఆ అలజడిని నుంచి రక్షించేందుకు సిద్ధమని అన‍్నారు.  

మరోవైపు ప్రపంచ దేశాల్లో టెక్‌ కంపెనీలను ఎస్‌వీబీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బెంజిన్‌  రోమ్‌లో పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే తాజా పరిస్థితులపై టెక్నాలజీ నిపుణులతో మాట్లాడారు. రోమ్‌ నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే అమెరికన్‌ దిగ్గజ బ్యాంక్‌ దివాళాతో దేశీయ టెక్‌ కంపెనీలపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనే విషయంపై ఫైనాన్స్‌, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌తో చర్చిస్తామని  ఇజ్రాయిల్‌ ప్రధాని ట్వీట్‌లో చెప్పారు. 

కొంపముంచుతున్న ఎస్‌వీబీ బాగోతం
ఇక మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఇప్పటికే ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ఐటీ రంగం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మూసివేత ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్‌ దిగ్గజ బ్యాంక్‌తో లావాదేవీలు నిర్వహిస్తున్న అమెరికా, యూకే, ఇజ్రాయిల్‌తో పాటు మరిన్ని దేశాలకు చెందిన టెక్‌ కంపెనీలు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించగా.. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది అంటూ ప్రపంచవ్యాప్తంగా మరో సారి చర్చ మొదలైంది

ఐటీ రంగంలో ఏం జరుగుతోంది  
ఇప్పటికే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నాయి. ఏ మాత్రం లాభదాయకం లేదని అనిపిస్తే మూసేస్తున్నాయి. ట్విటర్‌లాంటి సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్ తో పాటు ఇతర వస్తువుల్ని అమ్మి పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా ఎస్‌వీబీ బ్యాంక్‌ మూసివేతతో ఐటి రంగం మరింత సంక్షోభం తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు