ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌: కోటి ఉద్యోగాలున్నాయ్‌!

2 Aug, 2022 12:11 IST|Sakshi

2023లో మూడు లక్షల  ఐటీ ఉద్యోగాలు

రెసిషన్‌ బెంగే వద్దు,  రానున్న  రోజుల్లో కోటి ఉద్యోగాలు

ఐటీ, బీపీఎం రంగాల ఉద్యోగాలపై టీమ్‌ లీజ్‌ రిపోర్ట్‌

సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా రెసిషన్‌ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందన్న ఆందోళనల మధ్య తాజా రిపోర్టు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు,ఐటీ నిపుణులకు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌-రష్యా వార్‌, అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో  టీమ్‌ లీజ్‌ నివేదిక   వారికి భారీ ఊరటనిస్తోంది.

ఐటీ, బీపీఎం(బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌) రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయని  "డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్"లో పేర్కొంది. మూడు లక్షలకు పైగా ఉద్యోగాల  కల్పనతో  దేశీయ ఐటీ,  బీపీఎం ఉద్యోగాలు 2023లో 7 శాతం  వృద్ది నమోదుకానుందని సోమవారంతెలిపింది. అంతేకాదు మొత్తంమీద భారతదేశ  ఐటీ ఉద్యోగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (కోటి) పెరగనుందని అంచనావేసింది.

ఇండియాలో ఐటీ,బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 3.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది, అలాగే దేశ జీడీపీలో 8 శాతానికి పైగా తోడ్పడుతోందని టీమ్‌ లీజ్‌ తెలిపింది. గ్లోబల్ అవుట్‌సోర్సింగ్ మార్కెట్‌లో 55 శాతం వాటాను  సొంతం చేసుకుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ వెల్లడించారు.  తాజా రిపోర్టు ప్రకారం 2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుందని టీమ్‌లీజ్  తన ఎంప్లాయ్‌మెంట్  రిపోర్ట్లో పేర్కొంది.  అలాగే ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో  కూడా అత్యధికంగానే ఉంటుంది, 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది.  అయితే లిం​గ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి  25 శాతానికి పెరగబోతోందని తెలిపింది. 

పెట్టుబడులు, కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఇన్‌స్టాలింగ్‌తో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా.  ఐటీ సేవల కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు (GCC),  ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలు ఈ ట్రెండ్‌లో 70 శాతానికి పైగా దోహదపడుతున్నాయని నివేదించింది. 2023లో టాప్‌-10  ఐటీ కంపెనీలు  డిజిటల్‌ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయట. మార్కెటింగ్ టెక్నాలజీ,  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్  డిమాండ్ వరుసగా 5 -7 శాతం, 4-6 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన  రోజులు పోయాయని పేర్కొంది. 

ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర  నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్  గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని  టీమ్‌ లీజ్‌ నివేదించింది. 

మరిన్ని వార్తలు