వర్క్‌ ఫ్రం హోమ్ నుంచి క్రమంగా హైబ్రిడ్‌ పని విధానం వైపు

20 Mar, 2021 01:40 IST|Sakshi

హైబ్రిడ్‌ విధానానికి కంపెనీల మొగ్గు 

దశలవారీగా ఆఫీసులకు ఉద్యోగులు 

వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం కూడా అమలు 

ముంబై: కరోనా వైరస్‌ పరిణామాలతో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానానికి మళ్లిన కంపెనీలు క్రమంగా హైబ్రిడ్‌ పని విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. అటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఇటు ఆఫీసులకు రాదల్చుకున్న వారు కార్యాలయాలకు వచ్చి ఉద్యోగ విధులను నిర్వర్తించే విధానాన్ని అమలు చేయడంపై కసరత్తు చేస్తున్నాయి. బిర్లా గ్రూప్, ఆర్‌పీజీ గ్రూప్, కోటక్‌ మహీంద్రా, టాటా మోటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్, టెక్‌ మహీంద్రా తదితర సంస్థలు దీని అమలుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కోవిడ్‌–19 వేక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోగా మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి విజృంభించవచ్చన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 

జూలై నుంచి ఆఫీసులకు.. 
వేక్సినేషన్‌ ప్రక్రియ సింహభాగం పూర్తయ్యాక జూలై నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించవచ్చని చాలా మటుకు కంపెనీలు యోచిస్తున్నాయి. అయితే దీన్ని తప్పనిసరి చేయొద్దని భావిస్తున్నాయి. టీమ్‌లతో కలిసి పనిచేయడం, క్లయింట్లు.. టెక్నాలజీ ఇన్‌ఫ్రా అవసరాలను బట్టి ఇంటి నుంచే పనిచేయడమా లేక ఆఫీసుకు రావాలా అన్నది ఉద్యోగులే ఎంచుకునే అవకాశమివ్వాలని సంస్థలు యోచిస్తున్నాయి. కొన్ని సంస్థలు కన్వేయన్స్‌ రీయింబర్స్‌మెంట్‌ చేయడం, హోమ్‌ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం వంటి విధానాలు కూడా అమలు చేస్తున్నాయి.  ప్రస్తుతం ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానానికి అలవాటు పడినప్పటికీ చాలా మంది ఉద్యోగులు .. ముఖ్యంగా మహిళలు ఇంటి సంబంధ బాధ్యతల కారణంగా ఉద్యోగ విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఆఫీసుల్లో ఉండే మౌలిక సదుపాయాలు, ఇతర ఉద్యోగులతో బృందంగా కలిసి పనిచేయడం వల్ల ఉండే ప్రయోజనాలను వారు కోల్పోతున్నారని పేర్కొన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తిరిగి ఆఫీసు బాట పట్టాలని కూడా భావిస్తున్నట్లు వివరించాయి. దీంతో అందరి అభిప్రాయాలు సేకరించి, హైబ్రిడ్‌ విధానం ప్రయోజనాలు .. అంతర్జాతీయంగా అమలు చేస్తున్న విధానాలు తదితర అంశాలను అధ్యయనం చేసిన మీదట ఉద్యోగులను దశలవారీగా ఆఫీసులకు తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వర్గాలు తెలిపాయి. టీసీఎస్‌లో 4,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉండగా వీరిలో చాలా మందికి జూన్‌ ఆఖరు దాకా వర్క్‌ ఫ్రం హోమ్‌ ఆప్షన్‌ను కంపెనీ అమలు చేస్తోంది. అయితే, కనీసం 5 శాతం దాకా సిబ్బంది .. ఉద్యోగ విధుల నిర్వహణ కోసం ప్రతి రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలకు హాజరు అవుతున్నారని సంస్థ వర్గాలు తెలిపాయి.    

పనిలో హైబ్రిడ్‌ మోడల్‌ 
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  పని విషయంలో రానున్న రోజుల్లో హైబ్రిడ్‌ మోడల్‌ వైపు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారని స్టీల్‌కేస్‌ నివేదిక చెబుతోంది. మారుతున్న అంచనాలు, పని భవిష్యత్తు అన్న అంశంపై జరిగిన ఈ సర్వేలో భారత్‌తోపాటు 10 దేశాలకు చెందిన 32,000 మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రియల్టీ సంస్థల అధిపతులు పాలుపంచుకున్నారు. రెండుచోట్ల నుంచి.. అంటే ఇంటితోపాటు కార్యాలయం నుంచి కూడా పని చేసేందుకు (హైబ్రిడ్‌ విధానం) తాము సిద్ధమని సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది భారతీయులు తెలిపారు. మహమ్మారి తదనంతరం ఎక్కడి నుంచి విధులు నిర్వర్తించాలన్న విషయంపై ఉద్యోగులకు స్వేచ్ఛ ఉండాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల హెల్త్, ఫిట్నెస్‌కు సమయం కేటాయించవచ్చని 39 శాతం మంది చెప్పారు. విధులపై మెరుగ్గా దృష్టిసారించవచ్చని 33 శాతం మంది వివరించారు. అలాగే ఒంటరిగా అనిపిస్తోందని 26.4 శాతం, నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని 21.7 శాతం, పని–జీవిత సమతుల్యతపై ప్రభావం చూపుతోందని 20.4 శాతం మంది వెల్లడించారు. జీవితం సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు హైబ్రిడ్‌ మోడల్‌ను అనుసరిస్తామని అంతర్జాతీయంగా 72 శాతం మంది పేర్కొన్నారు. పూర్తిగా కార్యాలయం నుంచి పని చేస్తామని 23 శాతం, ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తామని 5 శాతం మంది తెలిపారు.    

మరిన్ని వార్తలు