మళ్లీ ఆఫీసులు కళకళ

21 Apr, 2023 05:52 IST|Sakshi

ఉద్యోగులను రప్పించేందుకు కంపెనీల చర్యలు

పని విధానాలను సమీక్షించుకుంటున్న కంపెనీలు

హైసియా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లోగడ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో మెజారిటీ ఉద్యోగులు పనిచేయడం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. వారంలో కొన్ని రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు.

కొన్ని కంపెనీలు అయితే వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు మంగళం కూడా పలికాయి. కంపెనీలు తమ పని విధానాలను సమీక్షించుకుంటున్నాయి. ఐటీ పరిశ్రమలో పని విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపై ప్రభావం చూపుతాయి. కనుక కంపెనీల్లో ప్రస్తుతం అమలవుతున్న పని విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు విధానాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ఓ సర్వే నిర్వహించింది. ఈ సంఘంలో 300కు పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటే, మూడింట ఒక వంతు కంపెనీలు సర్వేలో పాల్గొని వివరాలు తెలిపాయి.

సర్వేలోని అంశాలు..  
► ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా మూడింట ఒక వంతుకు పైగా కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు ఇప్పుడు వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీల్లో కార్యాలయాలకు వచ్చే వారు 22 శాతంగా ఉంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 38 శాతంగా ఉన్నారు.
► 62 శాతం కంపెనీల్లో 19 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్‌కు వెలుపల ఉన్న చోట నుంచే పనిచేస్తున్నారు. ఈ మేర ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా పనిచేయడం అన్నది 2023లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 21 శాతం కంపెనీల్లో అయితే 20–39 శాతం మేర ఉద్యోగులు, 13 శాతం కంపెనీల్లో 40–59 శాతం మేర ఉద్యోగులు హైదరాబాద్‌ బయటి నుంచే సేవలు అందిస్తున్నారు.
► 26 శాతం కంపెనీల్లో నూరు శాతం ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ (సెలవులు మినహా) కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. 28 శాతం కంపెనీల్లో మూడు రోజుల కార్యాలయ పనివిధానం నడుస్తోంది. 14 శాతం కంపెనీల్లో వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తుంటే, 15 శాతం కంపెనీలు ఫ్లెక్సీ (వీలునుబట్టి ఎక్కడి నుంచి అయినా) పని విధానాన్ని ఆచరిస్తున్నాయి.  
► భవిష్యత్తులో అవసరమైతే 2–5 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా కంపెనీలు విధానాలను రూపొందించుకున్నాయి. వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావిస్తున్నాయి.
► భవిష్యత్తులో పూర్తిగా ఆఫీసుకే వచ్చి పనిచేసే విధానాన్ని అమలు చేస్తామని 35 శాతం కంపెనీలు చెప్పాయి. వారంలో మూడు రోజులు అయినా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 12 శాతం కంపెనీలు వారంలో రెండు రోజుల విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నాయి.  
► టీమ్‌ వర్క్, సహకారం, సంస్థలో పని సంస్కృతి, గుర్తింపు, విధేయత, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి అంశాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంపై ప్రభావం చూపించనున్నాయి.
► సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగం నుంచే ఉన్నాయి. 27 శాతం ప్రొడక్ట్‌ కంపెనీలు కాగా, 24 శాతం ఇంటెగ్రేటెడ్‌ ఐటీ, ఐటీఈఎస్‌ సేవల రంగానికి చెందినవి ఉన్నాయి.

మరిన్ని వార్తలు