ఐటీలో భవిష్యత్‌ అంతా వీటిదే

22 Jun, 2021 07:34 IST|Sakshi

ఐటీ రంగానికి  కొత్త టెక్నాలజీ ఊతం

డేటా, క్లౌడ్‌ విభాగాల్లో  భారీ వృద్ధికి అవకాశం

విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్‌ 

న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీలు, సర్వీసులే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం వృద్ధికి దోహదపడనున్నట్లు దిగ్గజ సంస్థ విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్‌ తెలిపారు. డేటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ వంటి విభాగాలు భారీ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ నుంచి అయినా పనిచేయడం, క్రౌడ్‌సోర్సింగ్‌ తదితర విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్‌సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందని డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. వృద్ధి సాధన దిశగా తమ సంస్థ అయిదు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు.

కీలక రంగాలపై మరింతగా దృష్టి పెట్టడం, క్లయింట్లతో భాగస్వామ్యాన్ని పటిష్టపర్చుకోవడం, ప్రతిభావంతులైన సిబ్బందిపై ఇన్వెస్ట్‌ చేయడం, వ్యాపార నిర్వహణ విధానాన్ని సరళతరం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు డెలాపోర్ట్‌ తెలిపారు. వ్యాపార వ్యూహాల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమెరికా, యూరప్, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఇతర సంస్థలను కొనుగోలు చేసినట్లు వివరించారు. క్యాప్‌కో సంస్థ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ఆయన పేర్కొన్నారు.దీనికోసం విప్రో సుమారు 1.45 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. 

చదవండి: Gold: డిజిటల్‌ గోల్డ్‌తో.. లాభాల పంట

మరిన్ని వార్తలు