భారతీయులకు గుడ్‌న్యూస్‌.. డేటా రక్షణకు కొత్త బిల్లు

5 Aug, 2022 01:30 IST|Sakshi

బడ్జెట్‌ సమావేశాల్లో తెస్తాం 

ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ 

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్‌ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌ సంయుక్త కమిటీ మంచి నివేదిక ఇచ్చినట్టు అశ్వని వైష్ణవ్‌ తెలిపారు.

‘‘బిల్లులోని 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించింది. అలాగే, కొత్తగా మరో 12 ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లు తీసుకురావడం మినహా మారో మార్గం లేదు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడకుండా కొత్త చట్టాన్ని తయారు చేశాం. పార్లమెంటు ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలోనే కొత్త చట్టాన్ని అనుమతి కోసం తీసుకొస్తాం. వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి కొత్త బిల్లు ఆమోదం పొందొచ్చు’’ అని మంత్రి వివరించారు. ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సమగ్రమైన కార్యాచరణతో వస్తామని ప్రకటించారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగమైన డేటా గోప్యత, అత్యాధునిక సాంకేతికతలు, డేటా గవర్నెన్స్‌ కార్యాచరణ ఇందులో ఉంటాయన్నారు.  

అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి: నాస్కామ్‌ 
వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందు, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న డేటా గోప్యత చట్టాలను అధ్యయనం చేయాలని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సమాఖ్య నాస్కామ్‌ సూచించింది. అలాగే, కిందటి బిల్లుపై వచ్చినన అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం డేటా రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో నాస్కామ్‌ కీలక సూచనలు చేయడం గమనార్హం. గత బిల్లులో దేశాల మధ్య డేటా బదిలీకి సంబంధించి కఠినమైన నిబంధనల పట్ల దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు గగ్గోలు పెట్టడం తెలిసిందే. డేటా ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయ మార్గంలో వృద్ధి చెందేలా అవకాశం కల్పించాలని నాస్కామ్‌ కోరింది.  

సంప్రదింపుల్లో భాగం కల్పించండి.. 
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును భారత్‌ వెనక్కి తీసుకోవడాన్ని అంతర్జాటీయ టెక్నాలజీ దిగ్గజాలు అభినందించాయి. కొత్త బిల్లుకు సంబంధించి చర్చల్లో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెరికాకు చెందిన ఐటీఐ కోరింది. ఇందులో గూగుల్, మెటా, అమెజాన్‌ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ‘డిజిటల్‌ ఎకోసిస్టమ్‌కు సంబంధించి సమగ్రమైన న్యాయ కార్యాచరణను (కొత్త చట్టం) తిరిగి పరిశీలించే విషయంలో బలమైన భాగస్వామ్యుల సంప్రదింపులకు అవకాశం కలి్పంచాలనే ప్రణాళికను ఐటీఐ స్వాగతిస్తోంది’అని ఐటీఐ కంట్రీ మేనేజర్‌ (భారత్‌) కుమార్‌దీప్‌ తెలిపారు. 

ఇది కూడా చదవండి: యాపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌...

మరిన్ని వార్తలు