క్రిప్టో కరెన్సీ బ్యాన్‌.. చైనా కాదు కదా ఏదీ ఏం చేయలేవు

4 Oct, 2021 13:37 IST|Sakshi

ట్రెండ్‌ను పట్టుకోవడంలో మిగిలిన బిజినెస్‌మెన్‌ల కంటే ఒక అడుగు ముందుండే ఎలన్‌ మస్క్‌ సంచలన ‍వ్యాఖ్యలు చేశారు. సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న క్రిప్టోకరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవంటూ తేల్చి చెప్పారు. కాలిఫోర్నియాలో జరిగిన కోడ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ డిజిటల్‌ టెక్నాలజీలో ఆయన ప్రసంగించారు.


క్రిప్టో కరెన్సీపై వచ్చిన ప్రశ్నలకు ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ..  క్రిప్టో కరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవన్నారు. అయితే క్రిప్టో కరెన్సీ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొంత మేరకు ప్రభుత్వాలు అడ్డుకోగలవన్నారు. ఇటీవల చైనాకి చెందిన పీపుల్స్‌ బ్యాంక్‌ క్రిప్టో కరెన్సీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమెరికా సెనెట్‌ సైతం క్రిప్టో కరెన్సీకి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఎలన్‌ మస్క్‌ క్రిప్టో కరెన్సీని సమర్థిస్తూ మాట్లాడటంతో ఈ రంగంలో ట్రేడ్‌ చేస్తున్నవారికి కొండంత అండ లభించినట్టయ్యింది.

సాధారణ మార్కెట్‌లో బిగ్‌ ప్లేయర్లు మార్కెట్‌ను శాసిస్తుంటారు. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ అధికారికంగా బిగ్‌ ప్లేయర్లకు అనుగుణంగా మార్కెట్‌ కదలికలు ఉంటాయి. ఇలా మార్కెట్‌పై ఎవరి ఆధిపత్యం లేకుండా పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి ట్రేడ్‌ నిర్వహించడం క్రిప్టో కరెన్సీ ప్రత్యేకత. ఇందులో ప్రభుత్వ నియంత్ర ఉండదు. అలాగే జవాబుదారీతనం కూడా ఉండదు. ఆర్థిక లావాదేవీలు అన్నీ వర్చువల్‌గానే  జరుగుతాయి. దీంతో క్రిప్టో కరెన్సీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి : పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
 

మరిన్ని వార్తలు