ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు

1 Jun, 2023 06:30 IST|Sakshi

అనిశ్చిత పరిస్థితులే కారణం

కొంత కాలం వరకు ఇదే పరిస్థితి

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా

ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్‌ డిజిట్‌కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్‌ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది.

ఐటీ కంపెనీల అసోసియేషన్‌ నాస్కామ్‌ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్‌ బుక్, డీల్స్‌ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది.

రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్‌ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవలు, ఇన్సూరెన్స్‌ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది.  

మార్జిన్లు స్థిరం..
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్‌–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు