ఐటీ ఆదాయాలకు సవాళ్లు..

1 Apr, 2023 01:42 IST|Sakshi

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు

క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్‌ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్‌ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి.

ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత బీఎఫ్‌ఎస్‌ఐ సెగ్మెంట్‌లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్‌ డిజిట్‌ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్‌ ఈ నివేదిక రూపొందించింది.  

నివేదికలోని మరిన్ని అంశాలు..
► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్‌నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్‌ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్‌ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి.  
► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్‌ ప్యాకేజ్డ్‌ గూడ్స్‌ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్‌ సైన్సెస్‌ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్‌.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది.
► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు.  
► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు.
► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే
ఉండొచ్చు.  
► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు