ఐటీ షేర్లు.. ధూమ్‌ధామ్‌

5 Oct, 2020 12:33 IST|Sakshi

మార్కెట్ల హైజంప్‌- టెక్నాలజీ కౌంటర్లకు డిమాండ్‌

ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 3 శాతం అప్‌

సరికొత్త గరిష్టాలకు చేరిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 

రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకిన విప్రో లిమిటెడ్‌

టీసీఎస్‌ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన- ఐటీ షేర్లకు పుష్‌

వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 407 పాయింట్లు జంప్‌చేసి 39,104ను తాకింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 11,537 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఐటీ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌  3 శాతం ఎగసింది. ఇంట్రాడేలో 20,748ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా పలు కౌంటర్లు బుల్‌ దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జాబితా ఇలా
సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను ప్రకటించింది. ఇది ఐటీ పరిశ్రమకు బూస్ట్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఐటీ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించవచ్చన్న అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. దీంతో టీసీఎస్‌తోపాటు.. ఇన్ఫోసిస్‌, మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్‌, కోఫోర్జ్‌, బిర్లాసాఫ్ట్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.

జోరుగా హుషారుగా
ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు తొలుత 6 శాతం ఎగసింది. రూ. 2,679 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా ఇన్ఫోసిస్‌ రూ. 1,055 వద్ద, మైండ్‌ట్రీ రూ. 1,374 వద్ద, బిర్లాసాఫ్ట్‌ రూ. 210 వద్ద,  కేపీఐటీ టెక్నాలజీస్‌ రూ. 130 వద్ద, కోఫోర్జ్‌ రూ. 2,439 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఇక విప్రో 6 శాతం జంప్‌చేసి రూ. 331కు చేరింది. ఇది రెండు దశాబ్దాల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 388 వద్ద ఆల్‌టైమ్‌ హై'ని తాకింది. ఇతర కౌంటర్లలో మాస్టెక్‌, రామ్‌కో సిస్టమ్స్‌, స్యుబెక్స్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, టాటా ఎలక్సీ, ఈక్లెర్క్స్‌, న్యూక్లియస్‌ తదితరాలు 5-3 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు