గుడ్‌న్యూస్‌: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!

9 Dec, 2022 12:04 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ అప్‌

ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి వెల్లడి 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగంపై ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుతోందని ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి తెలిపారు. ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్ 2022లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ విషయాలు వివరించారు. (వర్క్‌ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు)

ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థానంలోనే ఉందని పురి చెప్పారు. గతంలో దాదాపు అయిదేళ్లలో పెరిగేంత స్థాయిలో ప్రస్తుతం చాలా మటుకు ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని, వినియోగ ధోరణులపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, వర్షపాత ధోరణులను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ మెరుగ్గానే ఉండబోతోందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడులకు ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పురి తెలిపారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?)

నిధుల లభ్యత, కార్పొరేట్ల ఆదాయాలు మొదలైనవన్నీ బాగున్నాయన్నారు. సామర్థ్యాల వినియోగం కూడా పుంజు కుంటోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడమనేది ఎగుమతులపరంగా ప్రతికూలాంశంగా ఉంటోందని పురి తెలిపారు. ప్రధానంగా దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టే తమ కంపెనీల్లాంటివి ప్రైవేట్‌ పెట్టుబడులను యథాప్రకారం కొనసాగిస్తున్నాయన్నారు. తయారీ రంగం కీలకమైనదే అయినప్పటికీ మిగతా రంగాల్లోనూ భారత్‌ పుంజుకోవాలని పురి చెప్పారు. ఆదాయాల స్థాయిలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  

    

మరిన్ని వార్తలు