ఐటీసీ డివిడెండ్‌ రూ. 6.25

19 May, 2022 01:09 IST|Sakshi

క్యూ4 నికర లాభం రూ. 4,260 కోట్లు

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 12% వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3,817 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15% పైగా బలపడి రూ. 17,754 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15% పెరిగి రూ. 12,632 కోట్లను దాటాయి. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 28 రికార్డ్‌ డేట్‌కాగా.. జులై 22–26 మధ్య డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. కంపెనీ ఫిబ్రవరిలోనూ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం తెలిసిందే.

విభాగాల వారీగా: ఐటీసీ క్యూ4 ఆదాయంలో సిగరెట్ల విభాగం నుంచి 10 శాతం అధికంగా రూ. 7,177 కోట్లు లభించగా.. ఎఫ్‌ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,149 కోట్లు సమకూరింది. ఇది 12 శాతం వృద్ధి. ఇక వ్యవసాయ సంబంధ బిజినెస్‌ మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 4,375 కోట్లను తాకింది. ఈ బాటలో హోటళ్ల ఆదాయం రూ. 105 కోట్లు జమ చేసుకుని రూ. 407 కోట్లను అధిగమించింది. పేపర్‌ బోర్డ్‌ అమ్మకాలు రూ. 1,656 కోట్ల నుంచి రూ. 2,183 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఐటీసీ నికర లాభం 16 శాతం పురోగమించి రూ. 15,243 కోట్లయ్యింది. 2020–21లో రూ. 13,161 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 65,205 కోట్లకు చేరింది.  
ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.75 శాతం బలపడి రూ. 267 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు