ఐటీసీ కొనుగోళ్ల వేట

13 Aug, 2021 04:04 IST|Sakshi

15,000 కోట్ల పెట్టుబడులు

తదుపరి వృద్ధి వ్యూహం అమలు

ఏపీలో ప్లాంట్‌ ఏర్పాటు

సంస్థ చైర్మన్‌ సంజీవ్‌ పురి వెల్లడి

న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్‌ భవిష్యత్తు వృద్ధి మార్గాలపై దృష్టి పెట్టింది. ఆకర్షణీయమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతోపాటు.. ‘ఐటీసీ నెక్ట్స్‌’ వ్యూహంలో భాగంగా సామర్థ్య విస్తరణకు రెండు బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15వేల కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించింది. వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పురి ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొనుగోళ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే కొనుగోళ్లకు చేసే ఖర్చు ప్రతిపాదిత పెట్టుబడులకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. డిమాండ్‌ను చేరుకునేందుకు, పోటీతత్వంతో కొనసాగేందుకు, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకునేందుకు అదనపు పెట్టుబడుల అవసరాన్ని ప్రస్తావించారు. వృద్ధికి మార్గాలను గుర్తించినట్టు చెప్పారు.  

కొత్త మార్గాలు..: ‘భవిష్యత్తు వినియోగ ధోరణులను గుర్తించాం. ఈ దిశగా ఏదైనా అవకాశం కనిపిస్తే.. అది మాకు విలువను తెచ్చిపెడుతుందని భావిస్తే ముందుకు వెళతాం (కొనుగోళ్లు). మధ్య కాలానికి దృష్టి సారిస్తూ.. అందులో భాగంగా 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాం. ఒక విభాగంలో సామర్థ్య వినియోగం గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చే స్తాం. ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకోవ డ మూ అవసరమే. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం (పేపర్‌), సూపర్‌ యాప్, ఐటీసీ మార్స్‌ (చిన్న రైతుల సామర్థ్య పెంపునకు సంబంధించి) అన్నవి కొత్త వృద్ధి విభా గాలు అవుతాయి’ అని సంజీవ్‌పురి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్పైస్‌ ప్లాంట్‌
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మసాలా దినుసుల ప్లాంట్‌ను ఐటీసీ ఏర్పాటు చేయనుంది. దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాంట్‌ను వినియోగించనున్నట్టు పురి ప్రకటించారు. ఐపీఎం సర్టిఫైడ్‌ ఆహార, మసాల ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కఠినమైన నిబంధనలను అందుకునేలా ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు