IT Returns Filing Last Date: ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి

10 Sep, 2021 00:06 IST|Sakshi

డిసెంబర్‌ 31వరకు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్‌ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి.

‘అసెస్‌మెంట్‌ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్‌ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ సరి్టఫికెట్‌లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది.

మరిన్ని వార్తలు