పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట

9 Sep, 2021 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి భారీ ఊరట కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు(సెప్టెంబర్ 30, 2021 వరకు ఉన్న) గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగిస్తూ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సీబీడీటీ సర్క్యులర్ నెం.17/2021 జారీ చేసింది. అకౌంట్లు ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సాధారణంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారాలను ఉపయోగించి తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తుల కోసం ఈ గడువును పొడగించారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?)

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు గడువును గతంలో జూలై 31, 2021 వరకు పొడిగించారు. అయితే, కొత్త ఆదాయపు పన్ను ఈ -ఫైలింగ్ పోర్టల్ లో సమస్యలు రావడం, కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా సెప్టెంబర్‌ 30 వరకు మళ్లీ పొడగించారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం వ్యక్తులకు సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు తేదీని నాలుగుసార్లు పొడిగించింది. మొదట జూలై 31 నుంచి నవంబర్ 30, 2020 వరకు, తర్వాత డిసెంబర్ 31, 2020 వరకు, చివరకు జనవరి 10, 2021 వరకు సీబీడీటీ పొడగించింది.
 

మరిన్ని వార్తలు