పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్‌

14 Apr, 2022 12:03 IST|Sakshi

మార్చిలో రూ. 4.6 బిలియన్‌ డాలర్లు 

ముంబై: ఈ మార్చిలో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడులు 22 శాతం క్షీణించాయి. 107 డీల్స్‌ ద్వారా 4.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక జనవరి–మార్చి కాలంలో లావాదేవీల పరిమాణం 54 శాతం జంప్‌చేసి 15.5 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. 360 డీల్స్‌ జరిగాయి. ప్రధానంగా స్టార్టప్‌ విభాగం ఇందుకు దోహదపడినట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నెలవారీ నివేదిక పేర్కొంది. పీఈ, వీసీ పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌గా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు అభిప్రాయపడింది. స్థూల ఆర్థికాంశాలలో పురోభివృద్ధి, పాలసీ నిలకడ ఇందుకు మద్దతివ్వనున్నప్పటికీ భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కఠిన పరపతి విధానాలు, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ పెంపు, యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ తదితర రిస్క్‌లున్నట్టు ఈవై పార్టనర్‌ వివేక్‌ సోనీ వివరించారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి

అమ్మకాలు వీక్‌ 
గత ఐదు త్రైమాసికాల్లోనే అత్యంత తక్కువగా ఎగ్జిట్‌ డీల్స్‌ 16 శాతం నీరసించి 4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. భారీ వ్యూహాత్మక, సెకండరీ డీల్స్‌ లోపించడం ప్రభావం చూపింది. పీఈ పెట్టుబడులుగల ఐపీవోలు సైతం తగ్గడంతో పీఈ, వీసీ విక్రయాలు మందగించాయి. పెట్టుబడుల విషయానికివస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో 10.1 బిలియన్‌ డాలర్ల విలువైన 45 భారీ డీల్స్‌ జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 6.7 బిలియన్‌ డాలర్ల విలువైన 30 భారీ డీల్స్‌ నమోదయ్యాయి. ఇక అంతక్రితం త్రైమాసికం అంటే అక్టోబర్‌–డిసెంబర్‌లో 19.5 బిలియన్‌ డాలర్ల విలువైన 53 భారీ డీల్స్‌ జరిగాయి.  

77 శాతం అధికం 
రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలను మినహాయించి చూస్తే మార్చి క్వార్టర్‌లో మొత్తం పెట్టుబడులు(బెట్స్‌) 13.9 బిలియన్‌ డాలర్లను తాకాయి. ఇది 77 శాతం వృద్ధికాగా.. గతేడాది ఇదే కాలంలో 7.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే నమోదయ్యాయి. అయితే డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన 21.6 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 36 శాతం తక్కువ. స్టార్టప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 255 డీల్స్‌ ద్వారా 7.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది జనవరి–మార్చిలో 175 డీల్స్‌ ద్వారా 2.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో 233 డీల్స్‌ ద్వారా 9.6 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ నమోదయ్యాయి. బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడుల విషయంలో ఐదు రంగాలు వీటిని అందుకున్నాయి. 71 డీల్సద్వారా ఫైనాన్షియల్‌ సర్వీసులు గరిష్టంగా 3.2 బిలియన్‌ డాలర్లు పొందాయి. ఈ బాటలో 47 డీల్స్‌ ద్వారా ఈకామర్స్‌ 2.7 బిలియన్‌ డాలర్లు, 59 లావాదేవీల ద్వారా టెక్నాలజీ రంగం 2.6 బిలియన్‌ డాలర్లు సాధించాయి. మార్చి క్వార్టర్‌లో నిధుల సమీకరణ 4.6 బిలియన్‌ డాలర్లకు జంప్‌చేసింది. గతేడాది ఇదే కాలంలో ఇవి కేవలం 1.7 బిలియన్‌ డాలర్లు. డిసెంబర్‌ క్వార్టర్‌లోనూ 1.6 బిలియన్‌ డాలర్ల సమీకరణ మాత్రమే జరిగింది. 
 

మరిన్ని వార్తలు