వెబ్‌ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్‌ 5 అంటున్నారు!

12 Jun, 2022 15:40 IST|Sakshi

ట్విటర్‌ మాజీ సీఈవో, కో ఫౌండర్‌ జాక్‌డోర్సే నుంచి సంచలన ప్రకటన వెలువడింది. డేటాప్రైవసీ, ఐడింటిటీల విషయంలో మరింత కట్టుదిట్టంగా ఉండే సరికొత్త ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫామ్‌ను రెడీ చేసినట్టు ఆయన వెల్లడించారు. వెబ్‌ 2, వెబ్‌ 3ల మేలి కలయికగా ఉండబోయే ఈ కొత్త ఇంటర్నెట్‌ ఫ్లాట్‌ఫామ్‌ను వెబ్‌ 5గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో లావాదేవీలు క్రిప్టోల్లోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు.

వెబ్‌ 5
ట్విటర్‌ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జాక్‌డోర్సే బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పని చేసే బ్లాక్‌ సంస్థలో భాగమయ్యారు. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ అనుబంధ సంస్థల్లో బ్లాక్‌ ఒకటి. బ్లాక్‌ ఎంతగానో శ్రమించి మరింత సమర్థంగా ఇంటర్నెట్‌ సేవలు అందించే వెబ్‌ 5కి రూకల్పన చేసింది. ఇంటర్నెట్‌కు తాము అందిస్తున్న గొప్ప కానుక వెబ్‌5 అని జాక్‌డోర్సే వెల్లడించారు. 

ఉపయోగాలు
వెబ్‌ 5 ప్రకటన సందర్భంగా నెటిజన్లు జాక్‌డోర్సేను పలు అంశాలపై ప్రశ్నించారు. వీటికి సమాధానం ఇస్తూ...వెబ్‌ 2లో డేటా, ఐటింటిటీ సమాచారం చాలా వరకు చోరీ అయ్యిందని, కానీ వెబ్‌ 5లో ఆ సమస్య ఉండదని వెల్లడించారు. ఇక్కడ ఎవరి పెత్తనాలు పని చేయబోవన్నారు. వెబ్‌ 3 ఇంకా అందరికి కొరుకుపడటం లేదు కాబట్టే వెబ్‌ 5కి వచ్చామని కూడా జాక్‌ డోర్సే అన్నారు.

వెబ్‌ ‘సిరీస్‌’లు
సాధారణంగా ఇంటర్నెట్‌ వినియోగంలోకి వచ్చిన తర్వాత డాట్‌కామ్‌ బూమ్‌, ఈమెయిళ్లు తదితర వాటిని వెబ్‌1గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్నెట్‌ ఆధారంగా పుట్టుకొచ్చిన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వెబ్‌ 2గా పరిగణిస్తున్నారు. ఇక ఫ్యూచర్‌ టెక్నాలజీగా చెప్పుకుంటున్న వర్చువల్‌ రియాలిటీ, మెటావర్స్‌లను వెబ్‌ 3గా భావిస్తున్నారు. వీటికి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అనుసంధానం చేసి వెబ్‌ 5గా పేర్కొంటున్నారు జాక్‌డోర్సే.

చదవండి: బస్సు డ్రైవర్లు జాగ్రత్త ! పరధ్యానంగా ఉంటే..

మరిన్ని వార్తలు