యాహూ! డీమ్యాట్‌ అకౌంట్‌లోకి రూ.11 వేల కోట్లు.. కానీ, కొన్ని గంటల్లోనే..

16 Sep, 2022 20:01 IST|Sakshi

ఒక్కోసారి అనుకోని ఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని శాశ్వతంగా నిలిచిపోగా మరికొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి.  ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన వల్ల కొన్ని గంటలు కోటీశ్వరుడిగా మారాడు. అదేంటి కొన్ని గంటల వరకే బిలియనీర్‌గా మారడం ఏంటని అనుకుంటున్నారా? 

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రమేష్‌ సాగర్‌ గత ఆరు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతను కోటక్ సెక్యూరిటీస్‌లో ఏడాది క్రితం డీమ్మాట్‌ అకౌంట్‌ని తెరిచి అందులో అనేక స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టేవాడు. అయితే ఓ రోజు అనకోకుండా అతని అకౌంట్‌లో సుమారు 11వేల కోట్లు జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన రమేష్‌ మొదట కంగారు పడినప్పటికీ తర్వాత జాక్‌పాట్‌ కొట్టానని ఆనంద పడ్డాడు.

వెంటనే అందులోంచి రూ. 2 కోట్లను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి సాయంత్రం వరకు రూ. 5 లక్షలు లాభాన్ని ఆర్జించాడు.  అయితే ఖాతాలో డబ్బులు క్రెడిట్‌ అయిన కొన్ని గంటలకే టెక్నికల్‌ సమస్య కారణంగా ఆ నగదు తన ఖాతాలో పడిందని, బ్యాంకు అధికారులు మెసేజ్‌ పంపారు. చివరకు బ్యాంకు నుంచి అతని ఖాతాలో క్రెడిట్‌ అయిన సొమ్ము కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యింది. కాగా బ్యాంకులో అవకతవకలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, బీహార్ గ్రామంలోని ఇద్దరు పిల్లలు అకౌంట్‌లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల జమ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!

మరిన్ని వార్తలు