అంబానీ ఇంటికి బెదిరింపుల కేసులో ట్విస్ట్‌

28 Feb, 2021 16:52 IST|Sakshi

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్‌ ఉల్‌ హింద్‌' సంస్థ ప్రకటించింది. టెలిగ్రామ్‌ యాప్‌లో మెసేజ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా తమ సంస్థకు డబ్బులు పంపించాలని ముఖేష్‌ను డిమాండ్‌ చేసింది. బిట్‌కాయిన్‌ ద్వారా అడిగినంత ధనాన్ని పంపాలని కోరింది. గురువారం పేలుడు పదార్థాలతో ఆ వాహనాన్ని అంబానీ ఇంటి సమీపంలో పార్క్‌ చేసిన తమ సోదరుడు సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాడు అని పేర్కొంది.

కాగా ఆ వాహనంలో 20 జిలెటిన్‌ స్టిక్స్‌తో పాటు ఓ లేఖ కూడా దొరికిన విషయం తెలిసిందే. అందులో నీతా అంబానీ, ముకేష్‌ భయ్యాకు ఇదొక ఝలక్‌ అని, నెక్ట్స్‌ టైమ్‌ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని, ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే అని రాసి ఉంది. గత నెల ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ కార్యాలయం దగ్గర బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని అంగీకరించింది. ఈ విషయాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయాయంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ను ఎద్దేవా చేసింది. 

ముంబైలోని ముకేష్‌ అంబానీ నివాసం యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఆ స్కార్పియోను దుండగులు చోరీ చేసుకుని తీసుకొచ్చారని తేల్చారు. ఆ పేలుడు పదార్థాలు నాగ్‌పూర్‌లోని సోలార్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినట్లుగా గుర్తించారు. వీటి బరువు 2.60 కిలోలుగా ఉన్నాయని తెలిపారు.

చదవండి: ఇది ట్రైలర్‌ మాత్రమే.. నెక్ట్స్‌టైమ్ అవి‌ మిమ్మల్ని చేరుకుంటాయి

ముఖేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు

మరిన్ని వార్తలు