యాభై ఏళ్లు.. తీరొక్క కారు, బుల్లెట్ల వర్షంలో సైతం దూసుకెళ్తూ..

26 Sep, 2021 14:41 IST|Sakshi

అందమైన లొకేషన్లలో మత్తెక్కించే.. కైపెక్కించే అమ్మాయిలతో సరదా షికారు. ‘‘ ఏమి హాయిలే హలా’’ అంటూ ఆహ్లాదమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న టైంలో.. ఊహించని విధంగా ఊడిపడే ముప్పు.  ఒక్కసారిగా మీద దూకే శత్రువులు.. వాళ్లతో ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌,   ‘ధడేల్‌’మంటూ పేలే బాంబులు.. దడ్‌దడ్‌ అంటూ బుల్లెట్ల వర్షం.. వాటి మధ్య నుంచే కారులో ‘జుయ్‌’ మంటూ దూసుకుపోతుంటాడు జేమ్స్‌ బాండ్‌.. 


జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీలో హీరోలు మాత్రమే రాయల్‌ లుక్‌లో కనిపించరు. ఆ సినిమాల్లో కనిపించే ప్రతీదానికి ఓ రిచ్‌నెస్‌, ప్రత్యేకతలు ఉంటాయి.  జేమ్స్‌ బాండ్‌ నడిపే కారుకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కారు బుల్లెట్లను కక్కుతుంది. కత్తులు దూస్తుంది. కొండలు ఎగబాగుతుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో దూసుకుపోతుంది.  అద్దాలు బద్దలు గొట్టుకుని ఒక బిల్డింగ్‌ నుంచి మరో బిల్డింగ్‌లోకి పోతుంది.  అవసరమైతే గాల్లో అమాంతం ఎగురుతుంది.  ఛేజింగ్‌లో బుల్లెట్లను, బాంబులను తట్టుకునే కార్లు బాండ్‌ బాబుకి శ్రీరామ రక్షగా నిలుస్తుంటాయి.  అందుకే బాండ్‌ బాబు వాడే బ్రాండ్‌ కార్లకు అంతే క్రేజ్‌ ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ ఆ కార్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు.
 


బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌

పేరుకే ఈ 007 ఏజెంట్‌.. ఓ గూఢచారి బ్రిటిష్‌ క్యారెక్టర్‌.

కానీ, ఏళ్లుగా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ వస్తున్నాడు.

బాండ్‌ రోల్‌లో కనిపించేది ఎవరైనాసరే..  అభిమానులు మాత్రం ఆ క్యారెక్టర్‌ను అతుక్కుపోతుంటారు. 

జేమ్స్‌ బాండ్‌ ఇరవై ఐదవ సినిమా ‘నో టైం టు డై’.. 

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈమూవీ.. సెప్టెంబర్‌ 30న ఇంగ్లండ్‌లో రిలీజ్‌ కానుంది. అమెరికా నుంచి అక్టోబరు 8న కొంచెం ఆలస్యంగా వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. 

ఈ సందర్భంగా దాదాపు యాభై ఏళ్లుగా బాండ్‌ వాడిన కార్ల మీద ఓ లుక్కేద్దాం.  


సన్‌బీమ్‌ అల్పైన్‌
బాండ్‌ ఎక్కువగా లోకల్‌ మేడ్‌ కంపెనీ కార్లను ఉపయోగిస్తుంటాడు.  జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీలో 1962లో ‘నో డాక్టర్‌’ నుంచి జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌ స్పెషల్‌ కార్లను ఉపయోగిస్తోంది. సన్‌బీమ్‌ అల్పైన్‌  కంపెనీ సిరీస్‌ 2 కారును ఉపయోగించాడు. క్లాసిక్‌ ఫ్యాషన్‌లో ఈ బ్లూ కలర్‌ కారులో నటుడు సీన్‌ కానరీ వెళ్తుంటే.. ఎంతో స్టైలిష్‌గా అనిపించకమానదు. అయితే సినిమాలో బాండ్‌ పర్సనల్‌ కారు కాదు. జమైకా ఏజెంట్‌ జాన్‌ వేస్‌ సొంత కారు.

  
 

బెంట్లీ మార్క్‌
ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌(1963) లో అప్పటికే మార్కెట్‌లోకి వచ్చి 30 ఏళ్లు గడిచిన బెంట్లీ మార్క్‌ IV కారును ఉపయోగించారు.


 

టయోటా
యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌(1967)లో జపాన్‌ ఫస్ట్‌ సూపర్‌ కార్‌ టయోటా 2000 జీటీని ఉపయోగించారు. అయితే సీన్‌ కానరీ పొడగరి కావడంతో ఆ కారుకు కొన్ని మార్పులు చేసి ప్రత్యేకంగా కారును డిజైన్‌ చేశారు. 

మెర్క్యూరీ కూగర్‌
ఆన్‌ హర్‌ మెజెస్టీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌(1969)లో ప్రేయసి ట్రేసీ కారును ఉపయోగిస్తాడు బాండ్‌. అందులో ఆమెది మెర్క్యూరీ కూగర్‌ ఎక్స్‌ఆర్‌-7 మోడల్‌ కారు. 

ఫోర్డ్‌
డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ఎవర్‌(1971)లో అప్పటిదాకా సినిమాల్లోకెళ్లా బెస్ట్‌ ఛేజింగ్‌ సీన్‌ ఉంటుంది. ఎర్రకలర్‌ ఫోర్డ్‌ మస్టాంగ్‌ మాచ్‌ 1 మోడల్‌ కారును అందుకోసం ఉపయోగించారు. ఈ ఛేజ్‌ సీన్‌ బాండ్‌ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.  డై అనదర్‌ డే(2002)లో ఐదు దశాబ్దాల కిందటి మోడల్‌ ఫోర్డ్‌ ఫెయిర్‌లేన్‌ను ఉపయోగించారు.

 

ఏఎంసీ హోర్నెట్‌
ది మ్యాన్‌ విత్‌ ది గోల్డెన్‌ గన్‌(1974) హోర్నెట్‌ ఎక్స్‌ హాట్చ్‌బ్యాక్‌ కారును ఉపయోగించారు. మేరీ గుడ్‌నైట్‌ను కాపాడే ప్రయత్నంలో బాండ్‌ చేసే ఛేజింగ్‌ కోసం ఈ కారును ఉపయోగించారు. 

లోటస్‌ ఎస్ప్రిట్‌
ది స్పై హు లవ్డ్‌ మీ(1977) కోసం ఎస్ప్రిట్‌ ఎస్‌1 కారును ఉపయోగించారు. అయితే సినిమాలో ఇదొక సూపర్‌ కార్‌గా చూపించేశారు. నీరు, గాలి, నేల మీద ఛేజ్‌ సీన్ల కోసం డిజైనింగ్‌ ఉండడం ప్రత్యేకం. రాకెట్లు సైతం పేల్చేది ఈ కారు. ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ(1981) కోసం లోటస్‌ ఎస్ప్రిట్‌ ఎస్సెక్స్‌ టర్బో మోడల్‌ కారును ఉపయోగించారు.  


సిట్రోయిన్‌
పాపం.. బాండ్‌ లోటస్‌ కారు నాశనం అయ్యాక కొత్త కారును వాడుతుంటాడు.  ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ(1981)లో సిట్రోయిన్‌ 2 సీవీ కారును ఉపయోగించారు.  


బజాబ్‌ ఆర్‌ఈ ఆటో
బాండ్‌ కేవలం కార్లు మాత్రమే వాడతాడా? అనే అనుమానాలు రావొచ్చు. అవసరమైతే బైకులు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఫస్ట్‌ టైం బాండ్‌ కోసం భారత్‌ ‘దేశీ’ టచ్‌ ఇచ్చారు. ఆక్టోపస్సీ(1983) సినిమాలో ఓ సీన్‌లో బాండ్‌ ఛేజింగ్‌ బజాజ్‌ ఆర్‌ మోడల్‌ ఆటోలో నడుస్తుంది. 


రెనాల్ట్‌ 
ఏ వ్యూ టు కిల్‌(1985)లో రెనాల్ట్‌ ట్యాక్సీని ఉపయోగించారు. 


రోల్స్‌ రాయిస్‌
రోల్స్‌ రాయిస్ సిల్వర్‌ క్లౌడ్‌ 2 మోడల్‌ కారును ‘ ఏ వ్యూ టు ఏ కిల్‌’(1985) సినిమా కోసం ఉపయోగించారు. మార్కెట్‌లోకి వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మోడల్‌ను బాండ్‌ మూవీలో ఉపయోగించారు.

బీఎండబ్ల్యూ
గోల్డెన్‌ఐ(1995) కోసం బీఎండబ్ల్యూ జీ3 మోడల్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత టుమారో నెవర్‌ డైస్‌(1997) కోసం బీఎండబ్ల్యూ 740ఐఎల్‌ను(750ఐఎల్‌ బ్యాడ్జ్‌లు) కారును బాండ్‌ వాడాడు.  ఇక 1999లో వచ్చిన ‘ది వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ కోసం బీఎండబ్ల్యూ జీ8 మోడల్‌ కారును ఉపయోగించారు.
 

ఆస్టోన్‌ మార్టిన్‌
బాండ్‌ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన కారు బ్రాండ్‌ ఇది. సుమారు పది సినిమాలకు పైగా ఈ కారునే బాండ్‌ క్యారెక్టర్‌ వాడుతుంది. ‘ది లివింగ్‌ డేలైట్స్‌’(1987) అస్టోన్‌ మార్టిన్‌ వీ8, గోల్డెన్‌ ఐ(1995), టుమారో నెవర్‌ డైస్‌(1997) కోసం అస్టోన్‌ మార్టిన్‌ డీబీ5, డై అనదర్‌ డే(2002) కోసం అస్టోన్‌ మార్టిన్‌ వీ12 వాన్‌క్విష్‌, కాసినో రాయల్‌(2006), క్వాంటమ్‌ ఆఫ్‌ సోలేస్‌(2008) కోసం డీబీఎస్‌ వీ12, అస్టోన్‌ మార్టిన్‌ డీబీ5 మోడల్‌ కారును కాసినో రాయల్‌(2006), స్కైఫాల్‌(2012) కోసం ఉపయోగించారు. రాబోయే ‘నో టైం టు డై’(2021)లోనూ జేమ్స్‌ బాండ్‌ డేనియల్‌ క్రెయిగ్‌ కోసం ఈ కంపెనీ కారునే ఉపయోగిస్తున్నారు.
 

- సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

చదవండి: గన్నులున్న బాండ్‌ కారు.. ధరెంతో తెలుసా?

మరిన్ని వార్తలు