కశ్మీర్‌ లోయలో రూ.879 కోట్ల భారీ ప్రాజెక్టు

23 Jan, 2023 11:02 IST|Sakshi

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆవిష్కరించింది. నిర్థేశిత ఉత్పత్తులకు క్లస్టర్లను అభివద్ధి చేసి అన్నదాతల ఆదాయాభివృద్ధి, పంట చేతికి వచ్చిన తర్వాత ఎదుర్కొనే నష్టాల నివారణే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


వచ్చే ఐదేళ్లలో గుర్తించిన ఐదు ఉత్పత్తుల ధర, నాణ్యత, బ్రాండింగ్, స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా, వాల్యూ అడిషన్లలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

17 జిల్లాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రాజెక్టు ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా జిల్లాల్లో మార్కెటింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్టేక్ హోల్డర్ల అభివృద్ధి, అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాం కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బడ్టెట్ లో రూ.879.75 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 7,030 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రతియేటా రూ.1,436.04 కోట్ల ఆదాయం లభించే 34 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 

యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డీజీ మంగల్ రాయ్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.పంట అనంతర నష్టాలు, సవాళ్లను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అంటున్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లోహ్.

మరిన్ని వార్తలు