సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు

13 May, 2022 06:34 IST|Sakshi

2021–22లో 13 బిలియన్‌ డాలర్లు

టోక్యో: అంతర్జాతీయంగా పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోవడంతో జపాన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం భారీగా నష్టాలు చవి చూసింది. ఏకంగా 1.7 లక్షల కోట్ల యెన్‌ల (దాదాపు 13 బిలియన్‌ డాలర్లు) నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్ప్‌ 4.9 లక్షల కోట్ల యెన్‌ల లాభాలు ఆర్జించింది. తాజా సమీక్షాకాలంలో అమ్మకాలు 10.5 శాతం పెరిగి 6.2 లక్షల కోట్ల యెన్‌లకు చేరాయి.

కంపెనీ పోర్ట్‌ఫోలియోకు ప్రత్యక్షంగా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన ఇంధన ధరలు మొదలైనవన్నీ కొంత కాలం పాటు తమ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇక నుంచి తమ పెట్టుబడులపై మరింత అదుపు తెచ్చుకోవడంతో పాటు కొంత రక్షణాత్మకంగా వ్యవహరించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈవో మసయోషి సన్‌ తెలిపారు. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌నకు యాహూ వెబ్‌ సర్వీసెస్, చైనా ఈ–కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా, వాహన సేవల సంస్థ డీడీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు ఉన్నాయి. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ట్విటర్‌ను ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు