ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి సోనీ

14 Oct, 2022 00:47 IST|Sakshi

టోక్యో: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్‌ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్‌ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్‌లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ యసుహిదె మిజూనో వెల్లడించారు.

పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్‌లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్‌ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్‌ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్‌వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్‌ వెగాస్‌లో జరిగిన సీఈఎస్‌ గ్యాడ్జెట్‌ షోలో సోనీ ఎలక్ట్రిక్‌ కార్‌ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.  

మరిన్ని వార్తలు