భారత్‌కు నిస్సాన్‌ గ్లోబల్‌ మోడల్స్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

19 Oct, 2022 08:24 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్‌ సంస్థ నిస్సాన్‌.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్‌యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్‌ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌–ట్రయల్, జూక్, కష్కాయ్‌ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్‌–ట్రయల్, కష్కాయ్‌ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది.  పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్‌–ట్రయల్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్‌  కూడా రోడ్డెక్కనుంది. 

ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్‌ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్‌ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్‌ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్‌లు ఉండాలి.

ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్‌ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్‌యూవీలకు 50 శాతం, హైబ్రిడ్‌ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు 5 శాతం జీఎస్టీ ఉంది. 

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!


 

మరిన్ని వార్తలు