అమరరాజా బ్యాటరీస్‌ నాయకత్వ మార్పు

15 Jun, 2021 03:39 IST|Sakshi

ఆగస్టు నుంచి కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్‌

కుమారునికి బాధ్యతలు అప్పగించనున్న వ్యవస్థాపక చైర్మన్‌ గల్లా రామచంద్రనాయుడు

రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్‌ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్‌ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్‌ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్‌ ప్రస్తుతం వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్‌గా పునర్‌నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు.

ఆ తర్వాత చైర్మన్‌గా జయదేవ్‌ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్‌గా అనుష్‌ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు జయదేవ్‌ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్‌ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్‌బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు