జేబీ కెమ్‌- ఏడీఎఫ్‌ ఫుడ్స్‌.. హైజంప్‌

15 Sep, 2020 11:06 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

11 శాతం దూసుకెళ్లిన జేబీ కెమికల్స్‌

ఇంట్రాడేలో 52 వారాల గరిష్టానికి షేరు

ఆశిష్‌ కచోలియా వాటా కొనుగోలు

మళ్లీ 5 శాతం జంప్‌చేసిన ఏడీఎఫ్‌ ఫుడ్స్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో ఫుడ్‌ ప్రొడక్టుల కంపెనీ ఏడీఎఫ్‌ ఫుడ్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

జేబీ కెమికల్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెల్త్‌కేర్‌ కంపెనీ జేబీ కెమికల్స్‌ రూ. 120 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 92 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 522 కోట్లను అధిగమించింది. ఇబిటా 62 శాతం ఎగసి రూ. 155 కోట్లను తాకగా.. మార్జిన్లు 8.25 శాతం మెరుగుపడి 29.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో జేబీ కెమ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 965ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 918 వద్ద ట్రేడవుతోంది. 

ఏడీఎఫ్‌ ఫుడ్స్‌
ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ కంపెనీ ఏడీఎఫ్‌ ఫుడ్‌లో దాదాపు 1.49 లక్షల షేర్లను ఆశిష్‌ కచోలియా కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది.  కంపెనీ ఈక్విటీలో 0.74 శాతం వాటాకు సమానమైన వీటిని కచోలియా షేరుకి రూ. 378 సగటు ధరలో సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఏడీఎఫ్‌ ఫుడ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అమ్మకందారులు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 400 సమీపంలో ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు ఇదే స్థాయిలో లాభపడటం గమనార్హం!

మరిన్ని వార్తలు