జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయోగం విజయవంతం

20 Jul, 2021 22:04 IST|Sakshi

జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైంది. న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్‌ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది.వ్యోమ నౌకలో జెఫ్‌ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. 

ఆలివర్‌ డేమెన్  రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో  25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్‌ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్‌ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది.

 న్యూ ఫెపర్డ్‌ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్‌ లైన్‌ను దాటి  106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ  షెపర్డ్‌ నౌకకు ఉపయోగించిన రియూజబుల్‌ బూస్టర్‌ సురక్షితంగా లాంచింగ్‌ స్టేషన్‌లో చేరుకుంది. వ్యోమనౌక మ్యాడ్యుల్‌లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు