అపర కుబేరుడి పెద్దమనసు.. భారీగా సొమ్ము దానం, వాళ్ల నోళ్లకు పుల్‌స్టాప్‌

23 Nov, 2021 11:33 IST|Sakshi

Jeff Bezos donates Million Dollars to Obama Foundation: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నప్పటికీ.. దాతృత్వం విషయంలో మాత్రం ఆ ఇద్దరి మీద ‘పిసినారులు’ అనే ట్యాగ్‌ వినిపిస్తుంటుంది. వాళ్లే ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌లు. ఛారిటీ ఫండ్‌ పేరుతో స్పేస్‌ టూరిజాన్ని ప్రమోట్‌ చేసుకుంది ఒకరైతే.. అసలు పిల్లికి బిచ్చం వేయడంటూ రెండో ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ తరుణంలో నెంబర్‌ టూ, అమెజాన్‌ బాస్‌ అయిన జెఫ్‌ బెజోస్‌ భారీ వితరణ ద్వారా తన పెద్ద మనసు చాటుకోవడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు.  
 

57 ఏళ్ల ఈ అమెరికన్‌ వ్యాపార దిగ్గజం ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు 750 కోట్ల రూపాయలు) డొనేషన్‌ ప్రకటించాడు. ఆ సొమ్మును అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్‌ ఒబామా నడిపిస్తున్న ఫౌండేషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అమెరికా పొలిటీషియన్‌, పౌర హక్కుల నేత జాన్‌ లూయిస్‌(దివంగత) గౌరవార్థం ఈ భారీ దానం చేస్తున్నట్లు బెజోస్‌ ప్రకటించారు. అంతేకాదు ఒబామా ప్రెసిడెన్షియల్‌ సెంటర్‌ పేరును జాన్‌ లూయిస్‌ ప్లాజాగా పేరు మార్చాలని అమెజాన్‌ చీఫ్‌, ఒబామా ఫౌండేషన్‌ను రిక్వెస్ట్‌ చేశారు. జెఫ్‌ బెజోస్‌ సంపదతో పోలిస్తే ఈ దానం చాలామందికి చిన్నదే అనిపించొచ్చు.. కానీ, సాయం అందుకునే ఎందరికో ఇది పెద్దదే అని Obama Foundation ప్రతినిధి కోర్ట్నీ విలియమ్స్‌ వెల్లడించారు.

 

ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంటూ.. కనీస దానాలు కూడా చేయట్లేదని, భూమి మీద సమస్యలు పట్టించుకోకుండా స్పేస్‌ టూరిజం మీద ఫోకస్‌ పెడుతున్నారంటూ మస్క్‌, బెజోస్‌లపై విమర్శలు ఉన్నాయి. బిల్‌ గేట్స్‌ లాంటి వాళ్లు సైతం వీళ్లను విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెజోస్‌ దానాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఓవైపు ఒబామా ఫౌండేషన్‌తో పాటు మరోవైపు న్యూయార్క్‌ యూనివర్సిటీ ఆధర్వ్యంలోని ఓ ఆస్పత్రికి సైతం 166 మిలియన్‌ డాలర్ల డొనేషన్‌ ఇవ్వడంతో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

 
మాక్‌కెంజీ స్కాట్‌తో జెఫ్‌ బెజోస్‌ (పాత చిత్రం)

ఇక అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నాక.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 600 మిలియన్‌ డాలర్లు డొనేషన్లు ఇచ్చినట్లు పక్‌ మీడియా ఓ కథనం ప్రచురిచింది. ఇవిగాక క్లైమేట్‌ ఛేంజ్‌ పోరాటం కోసం ఎర్త్‌ ఫండ్‌ ప్రతిజ్ఞ, నిరాశ్రయులైన వాళ్ల కోసం 2 బిలియన్ల దాకా సాయం ప్రకటించారు. బెజోస్‌ మాత్రమే కాదు.. ఆయన మాజీ భార్య మాక్‌కెంజీ స్కాట్‌ విడాకుల భరణం రూపంలో దక్కిన 8.5 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 2.7 బిలియన్‌ డాలర్లు దానం చేసి సంచలనం సృష్టించింది.

చదవండి: మనిషి పుట్టుక ఇక అంతరిక్షంలోనే! కానీ..

మరిన్ని వార్తలు