జూలైలో అమెజాన్‌ కొత్త సీఈవో జెస్సీకి బాధ్యతలు

28 May, 2021 15:42 IST|Sakshi

న్యూయార్క్‌: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి జెఫ్‌ బెజోస్‌ జూలై 5న తప్పుకోనున్నారు. ఆ రోజున కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు బెజోస్‌ (57) ఈ విషయాలు వెల్లడించారు. తనకు ఆ రోజుతో సెంటిమెంటు ముడిపడి ఉన్నందున జూలై 5ని ఎంచుకున్నట్లు షేర్‌హోల్డర్ల సమావేశంలో బెజోస్‌ తెలిపారు. 27 ఏళ్ల క్రితం 1994లో సరిగ్గా ఆ రోజున తాను కంపెనీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కొత్త సీఈవోగా ఎంపికైన జస్సీ ప్రస్తుతం అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. సీఈవోగా తప్పుకున్న తర్వాత బెజోస్‌.. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడతారు. 57 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించారు. మొదటగా ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ ధనవంతుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌ 187.4 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.   

చదవండి: అమెజాన్‌ వర్తకులకు కోవిడ్‌-19 ఆరోగ్య బీమా

మరిన్ని వార్తలు