గర్ల్‌ఫ్రెండ్‌ సోదరుడికి షాకిచ్చిన బెజోస్‌!

27 Jan, 2021 12:17 IST|Sakshi

లాస్‌ఏంజెల్స్‌: కోర్టు ఖర్చుల నిమిత్తం తనకు 1.7 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా ఇ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ తన గర్ల్‌ఫ్రెండ్‌ లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ శాంచెజ్‌కు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాలను బహిర్గం చేసినందుకు భారీ మొత్తం పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్‌ వేసిన జెఫ్‌ బెజోస్‌.. లాస్‌ ఏంజెల్స్‌ సుపీరియర్‌ కోర్టుకు తన అభ్యర్థన గురించి విన్నవించారు. తమ వ్యక్తిగత వివరాలను 2 లక్షల డాలర్లకు అమ్ముకోవడమే గాకుండా, తనపైనే పరువునష్టం దావా వేశాడని ఆరోపించారు. సోదరి లారెన్‌తో పాటు మైఖేల్ తనకు నమ్మకద్రోహం చేశాడన్నారు. కాగా లారెన్‌ శాంచెజ్‌తో బెజోస్‌కు సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందుకు కారకులైన వారి గురించి తాను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, కొంతమంది అజ్ఞాత వ్యక్తులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారని బెజోస్‌ 2019లో ఆరోపించారు. కాగా అప్పటికే భార్య మెకాంజీతో విభేదాలు తలెత్తగా విడాకులు తీసుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. బెజోస్‌ వివాహేతర సంబంధం కారణంగానే మెకాంజీ ఆయన నుంచి విడిపోయారని అప్పట్లోవార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా.. తన సోదరికి చెందిన నగ్న ఫొటోల లీకేజీ వెనక జెఫ్ బెజోస్ హస్తం ఉందని మైఖేల్‌ శాంచెజ్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఓ సంస్థకు ఆయన ఇచ్చిన కొన్ని ఫొటోలను ఆధారాలుగా చూపిస్తూ గతేడాది ఫిబ్రవరిలో లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.(చదవండి: మొత్తంగా 6 బిలియన్‌ డాలర్ల విరాళాలు!)

ఈ క్రమంలో నవంబరులో ఈ పిటిషన్‌ను విచారించిన జడ్జి సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక (యాంటీ- స్లాప్‌ లా ప్రకారం) ప్రతివాది కోర్టు ఖర్చులు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు మిలియన్‌ డాలర్లకు పైగా పరిహారం ఇవ్వాల్సిందిగా బెజోస్‌ కోరారు. ఈ విషయంపై స్పందించిన మైఖేల్‌ తరఫు న్యాయవాది.. ‘‘బెజోస్‌ కోర్టు ఫీజు కోరడం అనైతికంగా, అత్యంత వికారంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకోగా, బెజోస్‌ రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు