జెట్‌- దివాన్‌- కాస్మో ఫిల్మ్స్‌.. దూకుడు

19 Oct, 2020 14:23 IST|Sakshi

సానుకూల వార్తల ప్రభావం

10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

9 శాతం దూసుకెళ్లిన కాస్మో ఫిల్మ్స్‌ షేరు

విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌), కాస్మో ఫిల్మ్స్‌ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జెట్‌ ఎయిర్‌వేస్
కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారీ లాల్‌ జలాన్‌ ప్రతిపాదిత రిజల్యూషన్‌ ప్రణాళికకు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 42.20 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి గత 8 రోజుల్లో ఈ షేరు 47 శాతం ర్యాలీ చేసింది. రూ. 1,000 కోట్ల తొలి దశ పెట్టుబడి ద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌ను పూర్తిస్థాయి కార్యకలాపాలతో పునరుద్ధరించాలని  కల్‌రాక్‌ క్యాపిటల్‌ ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే రుణదాతలు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, భాగస్వాములతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

డీహెచ్‌ఎఫ్ఎల్
ఎన్‌బీఎఫ్‌సీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కొనుగోలుకి నాలుగు కంపెనీలు బిడ్డింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. బిడ్స్‌ దాఖలు చేసిన సంస్థలలో పిరమల్‌, అదానీ గ్రూప్‌లున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కోసం నాలుగు కంపెనీలు రిజల్యూషన్‌ ప్రణాళికలు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ, పిరమల్‌ గ్రూప్‌లతోపాటు యూఎస్‌ కంపెనీ ఓక్‌ట్రీ క్యాపిటల్‌, ఎస్‌సీ లోవీ సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్‌ఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13.85 వద్ద ఫ్రీజయ్యింది.

కాస్మో ఫిల్మ్స్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు ప్యాకేజింగ్ కంపెనీ కాస్మో ఫిల్మ్స్‌ తాజాగా పేర్కొంది. బైబ్యాక్‌ అంశంపై ఈ నెల 26న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత కాస్మో ఫిల్మ్స్‌ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 468కు చేరింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది.  

మరిన్ని వార్తలు