విమాన ఇంధనమూ ఆకాశాన్నంటింది!

17 Mar, 2022 05:45 IST|Sakshi

కిలోలీటర్‌ ధర రూ.1,10,666

ఇప్పటి వరకు ఇదే గరిష్టం

న్యూఢిల్లీ: దేశంలో విమాన ఇంధన ధరలు కనీనివినీ ఎరుగని స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా చమురు ధర బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత భారత్‌లో తొలిసారిగా కిలోలీటర్‌ (1,000 లీటర్లు) ధర రూ.1 లక్ష దాటి ఆల్‌టైమ్‌ హై రికార్డు నమోదు చేసింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) కిలోలీటర్‌ ధర ఢిల్లీలో 18.3 శాతం ఎగసి రూ.1,10,666.29కు చేరింది. ఈ ఏడాది ధర పెరగడం ఇది ఆరవసారి. గడిచిన పక్షం రోజులలో సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా జెట్‌ ఇంధన ధరలు ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తున్నారు. 2022 జనవరి 1 నుంచి చూస్తే కిలో లీటర్‌కు మొత్తం రూ.36,643.88 ఎగసింది.

అంటే దాదాపు 50 శాతం అధికమైంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయిల్‌ ధర  బ్యారెల్‌కు గత వారం 14 ఏళ్ల గరిష్టం 140 డాలర్లకు చేరింది. ధర ప్రస్తుతం 100 డాలర్లకు వచ్చి చేరింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో జెట్‌ ఇంధనం వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్‌ ధర రూ.71,028.26 నమోదైంది. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 147 డాలర్లుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ ధరలు గతేడాది నవంబర్‌ 4 నుంచి భారత్‌లో అదే రీతిలో కొనసాగుతున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యమే ఇందుకు కారణం. ఎల్‌పీజీ ధరలో సైతం 2021 అక్టోబర్‌ నుంచి ఎటువంటి మార్పు లేదు.

మరిన్ని వార్తలు