బంగారంపై జీఎస్‌టీ తగ్గించండి

19 Jan, 2022 09:02 IST|Sakshi

ఆభరణాల పరిశ్రమ విజ్ఞప్తి 

ముంబై: ఆభరణాల పరిశ్రమపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రస్తుత 3 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్‌ ముందస్తు సిఫారసులు చేస్తూ బంగారం, విలువైన లోహాలు, రత్నాలు అటువంటి వాటితో తయారు చేసిన ఆభరణాలపై ఆదాయ సమానత్వ సూత్రం ఆధారంగా 1.25 శాతం జీఎస్‌టీ రేటును అమలు చేయాలని కేంద్రాన్ని  కోరుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ భారతదేశంలోని అనేక కుటుంబాలు పాన్‌ కార్డులను కలిగి ఉండవని, ఈ పరిస్థితుల్లో అవసరమైన సమయాల్లో అవసరమైన కనీస ఆభరణాలను పొందడంలో వారు ఇబ్బందుల పడుతున్నారని తెలిపింది. ఈ ఇబ్బందులను ఎదుర్కొనడంలో భాగంగా పాన్‌ కార్డ్‌ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని ఆర్థికమంత్రిని కోరింది. 

ఏ శాఖ అధికారులు ప్రశ్నించకుండా గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎంఎస్‌) కింద ఒక వ్యక్తి డిపాజిట్‌ చేయగలిగే బంగారం కనీస పరిమాణంపై తగిన స్పష్టత ఇవ్వాలనీ కేంద్రానికి కోరింది. 22 క్యారెట్ల బంగా రు ఆభరణాల కొనుగోలు కోసం రత్నాలు,ఆభరణాల పరిశ్రమకు  ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ (ఈఎంఐ) సౌకర్యాన్ని అనుమతించాలని పరిశ్రమ సంఘం అభ్యర్థించింది. మహమ్మారి నేపథ్యంలో పరిశ్రమ వ్యాపార పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది.  
 

చదవండి: ‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్‌టీ తగ్గాల్సిందే’

మరిన్ని వార్తలు