అక్షయ తృతీయ.. ‘నగ’ ధగలు!

2 May, 2022 23:47 IST|Sakshi

అమ్మకాలు పుంజుకుంటాయని వర్తకుల ఆశాభావం..

2019 స్థాయిలను అధిగమిస్తాయని అంచనా 

న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల కోవిడ్‌ సంబంధిత అంతరాయాల తర్వాత మే 3వ తేదీ అక్షయ తృతీయపై కొందరు నగల వ్యాపారులు పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నందున అమ్మకాలు 2019 స్థాయిలను అధిగమిస్తాయని ఆశిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన బంగారం ధరలు అడ్డంకిగా మారవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.52,000 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర రూ.1,900 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

కొనుగోళ్లకే మొగ్గు... 
ధరల పెరుగుదల వల్ల ముందస్తు బుకింగ్స్‌ తగ్గాయని పేర్కొన్న అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్‌ అశిష్‌ పాతే తెలిపారు. అయితే పరిస్థితి ఎలా ఉన్నా, పసిడి అమ్మకాలు 2019తో పోల్చితే 5 శాతానికిపైగా పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్షయ తృతీయనాడు పసిడి కొనుగోళ్లకే ప్రజలు మొగ్గుచూపుతారన్న అభిప్రాయాన్ని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ చైర్మన్‌ అహ్మద్‌ ఎంపీ వ్యక్తం చేశారు. ఎటువంటి పరిమితులు లేకుండా 2019 తరువాత జరుగుతున్న తొలి అక్షయ తృతీయ పర్వదినాన అమ్మకాలు పెరుగుతాయన అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌పీ జ్యూయెలర్స్‌ డైరెక్టర్‌ అదిత్య పాథే పేర్కొన్నారు. ధరలు దిగివస్తే పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండేదని కూడా ఆయన అన్నారు. 

డిమాండ్‌లో 11 శాతం వృద్ధి 
2022–23పై ఇక్రా అంచనా 
భారత్‌ పసిడి డిమాండ్‌ ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం పురోగమిస్తుందన్న అంచనాలను ఇక్రా రేటింగ్స్‌ వెలువరించింది. ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ గ్రూప్‌ హెడ్‌ జయంత రాయ్‌ వెల్లడించిన నివేదికలోని ముఖ్యాంశాలు... 

  • ఆభరణాల రిటైల్‌ పరిశ్రమలో వ్యవస్థీకృత రిటైలర్ల ఆదాయాలు 14 శాతం వృద్ధితో పెరిగే అవకాశం ఉంది, స్టోర్‌ విస్తరణ, సంబంధిత ప్రణాళికలు అలాగే డిమాండ్‌ అసంఘటిత విభాగం నుండి క్రమంగా వ్యవస్థీకృత రంగం వైపు  వాటి వైపు మళ్లడం వంటి అంశాలు దీనికి కారణం.  
  • ప్రస్తుత అక్షయ తృతీయ సీజన్‌లో డిమాండ్‌ పటిష్టంగా ఉంటుందని అంచనా. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి ఏకంగా  45 శాతం ఉంటుందని భావిస్తున్నాం.  భారతీయ వినియోగదారులకు బంగారం పట్ల ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం, వివాహాలు, పండుగల వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం మొత్తంమీద డిమాండ్‌ 11 శాతం పెరగడానికి దోహదపడుతుంది.  
  • కరోనా సవాళ్లకు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20తో పోల్చితే ఆభరణాలకు డిమాండ్‌ 2022–23లో ఏకంగా 40 శాతం అధికంగా ఉంటుందని అంచనా. ధరలు పెరిగినప్పటికీ 2021–22లో ఈ డిమాండ్‌ 26 శాతంగా అంచనా వేయడం జరిగింది.  
  • స్టోర్ల విస్తరణ వంటి అంశాలతో వ్యవస్థీకృత రంగం ఆదాయాలు 14% మెరుగుపడతాయని భావిస్తున్నాం.  
  • స్టోర్‌ విస్తరణలు, ఇతర నిధుల అవసరాల కోసం రిటైలర్ల రుణ స్థాయిలు ఇటీవలి త్రైమాసికాల్లో పెరిగినప్పటికీ, ఆదాయాలలో స్థిరమైన వృద్ధి వల్ల పరిశ్రమ రుణాలకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనబోదు.

అడ్డంకులు ఉన్నా.. 
కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఆక్షయ తృతీయ  పసిడి కొనుగోళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నాం. కోవిడ్‌ పరిమితుల సడలింపు, ఎకానమీ పటిష్ట రికవరీ, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పసిడిని పరిగణించడం వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిస్తే, అధిక ధరలు కొంత అడ్డంకిగా మారే వీలుంది. అయినా పండుగ రోజు పసిడి కొనుగోలు మంచిదన్న సెంటిమెంట్‌ పరిశ్రమకు ఉత్సాహాన్ని ఇస్తుందన్నది మా అంచనా.  
– సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) సీఈఓ  

>
మరిన్ని వార్తలు