మగువ.. అరకేజీ బంగారం.. ఓ ఆసక్తికరమైన కేసు

10 Jan, 2022 09:08 IST|Sakshi

ITAT Specified Gold Jewellery for married women in taxable income: బంగారం ఎంత ఉంటే ఇబ్బంది లేదన్న విషయంలో బంగారం లాంటి రూలింగ్‌ (తీర్పు) వచ్చింది ఈ మధ్య. ఇది మహిళలకు.. ముఖ్యంగా సంక్రాంతి ముందు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.  


సాధారణంగా ఆదాయపు పన్ను అసెస్‌మెంటు పూర్తయిన తర్వాత, ఆ అసెస్‌మెంట్‌ ఆర్డర్‌లోని విషయాలతో విభేదిస్తే.. ఒప్పుకోకపోతే లేదా మీకు నష్టం అనిపిస్తే మీరు ఉన్నత అధికారులకు లేదా ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అలాంటి ఒక అసెస్సీ తనకు న్యాయం కావాలని ఢిల్లీలో ఉన్న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ అన్ని వివరాలు, కాగితాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకుని, వివాహిత విషయంలో 500 గ్రాముల బంగారం ఉన్నా కూడా ఎటువంటి విధంగానూ దాని విలువను ఆదాయానికి కలపకూడదని తీర్పు ఇచ్చింది.  

కేసు పూర్వాపరాల్లోకి వెడితే .. ఓ ఆదాయపు అధికారి ఒక వివాహిత ఆదాయాన్ని మదింపు చేస్తున్నారు. ఈ సందర్భంగా సెర్చి కేసులో సుమారుగా రూ. 66 లక్షలు విలువ చేసే బంగారం దొరికింది. అందులో రూ. 10,00,000 బంగారానికి సంబంధించి కాగితాలు, బిల్లులు లేవు. ఈ విలువను ఆదాయంగా పరిగణించి ఆ మహిళ ఆదాయానికి కలిపి అసెస్‌మెంటు పూర్తి చేశారు. ఈ ఆర్డరును విభేదిస్తూ ఆ వివాహిత.. ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నారు. ఆ అప్పీలులో ఆమె 1994 మే 11 నాడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేసిన 1916 నంబరు సూచనను ప్రస్తావించారు. ఈ సూచన కింద నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటంటే..  

 వెల్త్‌ ట్యాక్స్‌లో డిక్లరేషన్‌ చేసిన బంగారం కంటే ఎక్కువ బంగారం ఉంటే జప్తు చేయవచ్చు. 
   వెల్త్‌ ట్యాక్స్‌ పరిధిలోకి రాని వాళ్ల విషయంలో.. వివాహిత మహిళ అయితే 500 గ్రాముల వరకు, వివాహం కాని మహిళ విషయంలో 250 గ్రాములు, పురుషులకు సంబంధించి 100 గ్రాముల వరకు పసిడి ఉంటే జప్తు చేయకూడదు. 
 కుటుంబ స్థాయిని బట్టి, ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో పరిస్థితులను బట్టి జప్తు చేయాలి. ఉన్నతాధికారులకు తెలియజేయాలి. 
►  ఉన్న/దొరికిన బంగారం విషయంలో సమగ్రమైన పట్టిక/జాబితా తయారు చేయాలి. 
ప్రస్తుతం మన దేశంలో వెల్త్‌ ట్యాక్స్‌ చట్టం రద్దు అయింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక కుటుంబం అసెస్‌మెంటుకు సంబంధించి .. పైన పేర్కొన్న పరిమితుల మేరకు మదింపు చేయాలి. ఈ నేపథ్యంలోనే.. 1916 నంబరు సూచనను ప్రస్తావిస్తూ ఢిల్లీ ట్రిబ్యునల్‌ తాజా రూలింగ్‌
ఇచ్చింది.  

మీకు తెలిసే ఉండొచ్చు.. అసెస్‌మెంటు సందర్భంలో కేవలం ఆదాయమే కాకుండా ఇతర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. లెక్కలోకి రాని నగదు, బంగారం, భవంతులు, ఆస్తిపాస్తులు, పెద్ద ఖర్చులు.. ఇవన్నీ ఉన్నాయంటే ఆ మేరకు ఆదాయం ఉందన్నట్లుగా (లేదా రుణం, సోర్స్‌ ఉండాలి) అధికారుల అసెస్‌మెంటు ఉంటుంది. కాబట్టి, మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. మీ దగ్గరున్న బంగారం జాబితా తయారు చేసుకోండి. జాబితా ప్రకారం బంగారం కాగితాలను భద్రపర్చుకోండి. ఆ లెక్కల్ని చూపించండి. మీ పుట్టింటి వారు ఇచ్చినది, అత్తగారు ఇచ్చినదీ, దగ్గర బంధువులు ఇచ్చినదీ, మీ వారు కొన్నదీ.. అన్నింటి జాబితా తయారు చేసి దగ్గర ఉంచుకోండి. ఎటువంటి సమస్యా ఉండదు.   

:: కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య.. ట్యాక్సేషన్‌ నిపుణులు

మరిన్ని వార్తలు