ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్‌

18 Jan, 2023 05:16 IST|Sakshi

ఇందుకోసం విధానం తీసుకురావాలి

జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పరిశ్రమ డిమాండ్‌

ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్‌) సేవలకు ఔట్‌సోర్స్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్‌ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్‌ మార్కెట్‌లో భారత్‌ వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్‌ వాటా 5.75 బిలియన్‌ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది.

‘‘ప్రస్తుతం ఈ మార్కెట్‌లో అంతర్జాతీయంగా భారత్‌ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్‌ రంగంలోనూ భారత్‌ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చు.

బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్‌ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు