Akshaya Tritiya 2022: బంగారం అమ్మకాలు అదుర్స్‌, అమ్మో..ఒక్కరోజే ఇన్నివేల కోట్లా!

4 May, 2022 09:08 IST|Sakshi

అక్షయ తృతీయ రోజు మనదేశంలో బంగారం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2019 తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరగడంతో అక్షయ తృతీయ రోజే బంగారం అమ్మకాల మార్కెట్‌ విలువ రూ.15వేల కోట్లుగా ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) అంచనా వేసింది. 

కరోనా మహమ్మారికి కారణంగా రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న బులియన్‌ మార్కెట్‌ (బంగారం) ఈ ఏడాది పుంజుకుంది. కరోనా లాక్‌డౌన్‌లు, ఆంక్షలు లేకపోవడం..రంజాన్‌ సెలవుదినం కావడం కారణంగా నిన్న ఒక్కరోజే (అక్షయ తృతీయ) బంగారం అమ్మకాలు 15వేల కోట్లకు పైగా జరిగాయని సీఏఐటీ ప్రెసిడెంట్‌ ప్రవీణ్ ఖండేల్వాల్, ఆల్‌ ఇండియా జ్యుయలర్స్‌ అండ్‌ గోల్డ్‌ స్మిత్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ అరోరాలు తెలిపారు. ముఖ్యంగా లైట్‌ జ్యుయలరీ (డ్రిల్ చేయని రాక్ క్రిస్టల్ ఆర్బ్స్) ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఉత్సాహం చూపించారని అన్నారు. 

భారీగా పెరిగిన బంగారం ధరలు 
అక్షయ తృతీయ అమ్మకాలపై అరోరా మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం కంటే ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిందని, అయినా కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, అందుకు ఈ ఏడాది జరిగిన బంగారం అమ్మకాలే నిదర్శనమన్నారు. 2019 అక్షయ తృతీయ నాటికి 10గ్రాముల బంగారం ధర రూ.32,700 ఉండగా.. కిలో వెండి ధర రూ.38,350గా ఉంది. మరి ఈ ఏడాది అదే 10 గ్రాముల బంగారం ధర రూ.53వేలు ఉండగా.. కిలో వెండి ధర రూ.66,600గా ఉంది. 

ఎంత బంగారం దిగుమతి చేశారంటే 
సీఏఐటీ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బీసీ భారతియా తెలిపిన వివరాల ప్రకారం.. 2021 క్యూ1లో 39.3 టన్నుల గోల్డ్‌ బార్స్‌ (కడ్డీలు), కాయిన్స్‌ బంగారం దిగుమతి చేసుకుంటే.. ఈ ఏడాది తొలి క్యూ1లో 41.3 టన్నలు బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు నివేదించారు. 

బంగారం జ్యుయలరీ (రింగ్స్‌,చైన్లు,బ్రాస్‌లెట్లు మొదలైనవి) 2021 తొలి క్యూ1లో 126.5 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే..2022లో 94.2టన్నుల బంగాన్ని దిగుమతి చేసుకున్నట్లు భారతీయ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్ల ఆలోచనా ధోరణి మారిందని, ఎక్కువగా బంగారం కడ్డీలు, కాయిన్స్‌ మీద ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

సేల్స్‌ పెరిగాయి
ఖండేల్వాల్, పంకజ్‌లు.. 2019లో అక్షయ తృతీయ రోజు రూ.10వేల కోట్లు బంగారం అమ్మకాలు జరిగాయని, ఇక 2020లో కేవలం బంగారం అమ్మకాలు 5శాతంతో రూ.500కోట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో మాత్రం రూ.15వేల కోట్ల మేర బంగారం కోనుగోలు జరిగినట్లు అంచనా వేశారు. రెండేళ్ల తరువాత దేశంలో జరిగిన ఈ అమ్మకాలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

చదవండి👉అక్షయ తృతీయ: బంగారం కొన్నారా? అయితే ఇది మీ కోసమే!

మరిన్ని వార్తలు