హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్‌!

22 Mar, 2023 20:56 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడిదారుడు బిలియనీర్‌, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.  2023  హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎంట్రీ ఇచ్చారు.  2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో  18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా  రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్‌లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్‌ప్రైజెస్ ఈ లిస్ట్‌లోచేరింది. 

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్‌లతో  మూడో స్థానాన్ని ఆక్రమించింది.

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్‌ టాప్‌లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్,  టాటా మోటార్స్ , క్రిసిల్  రేఖ  టాప్ పిక్స్‌గా చెప్పుకోవచ్చు. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్‌లు రేఖ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

రేఖ ఝున్‌ఝున్‌వాలా ఎవరు?
బిగ్‌బుల్‌గా పాపులర్‌ అయిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  భార్య రేఖ.  రాకేష్‌ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా.  వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్‌ప్రైజెస్ లో రాకేష్‌ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు.
 
కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్‌ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్‌గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు.  

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పద్మశ్రీ
మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ  కుటుంబం  ఆయన తరపున అవార్డును స్వీకరించింది.

మరిన్ని వార్తలు